Vinod Kambli: నడవలేని స్థితిలో భారత మాజీ క్రికెటర్.. అసలేమైందంటూ అభిమానుల ఆరా.. షాకింగ్ వీడియో!
![Vinod Kambli Caught On Camera Struggling To Walk Properly](https://imgd.ap7am.com/thumbnail/cr-20240806tn66b1a1c615264.jpg)
- సరిగ్గా నడవలేని స్థితిలో కెమెరాకు చిక్కిన వినోద్ కాంబ్లీ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- వీడియోను సచిన్‌కు ట్యాగ్ చేస్తూ షేర్ చేసిన నెటిజన్
భారత మాజీ క్రికెటర్, సచిన్ బాల్యమిత్రుడు వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు. సరిగ్గా నడవడానికి కష్టపడడం వీడియోలో కనిపించింది. దాంతో ఇద్దరు వ్యక్తులు అతడిని చేతులు పట్టుకుని రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్లడం వీడియోలో ఉంది. ఈ వీడియో అభిమానులను షాక్‌కు గురిచేసింది. దాంతో కాంబ్లీకి ఏమైందంటూ ఆరా తీస్తున్నారు.
అయితే, వీడియో చూసిన వారిలో కొందరు అతను తాగి ఉన్నాడని చెబుతుంటే.. మరికొందరు ఆయన కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నాడని, అతని ఆరోగ్యం క్షీణించడం వల్ల సరిగ్గా నడవలేకపోతున్నాడని చెబుతున్నారు.
కాగా, ఈ వీడియోను ఓ ఎక్స్ (ట్విట్టర్) యూజర్ సచిన్ టెండూల్కర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. "వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసి విచారంగా ఉంది. మద్యం, అహం ఏమి చేస్తాయో చూడండి. కానీ సచిన్ అతనిని ఆదుకోవడానికి వస్తారని, కాంబ్లీకి పునరావాసం కల్పించడానికి ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
కాంబ్లీ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. భారత్ తరఫున 100కు పైగా వన్డేలు, 17 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన కాంబ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో దాదాపు 10,000 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 262.