Jagan: సెక్యూరిటీ తగ్గించారంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్

Jagan files petition in high court seeking security

  • తనకు సీఎం హోదాలో ఇచ్చే భద్రత కావాలన్న జగన్
  • జూన్ 3 నాటికి జగన్ కు 900 మందితో భద్రత ఉండేదన్న న్యాయవాదులు
  • ఇప్పుడు కూడా అదే రీతిలో సెక్యూరిటీ కల్పించాలంటూ జగన్ పిటిషన్ 

తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారంటూ వైసీపీ అధినేత జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. 

కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా తన భద్రతను తొలగించిందని, తనను అంతమొందించే లక్ష్యంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని జగన్ తన పిటిషన్ లో ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉన్న విషయాన్ని పరిశీలించకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం తగదని పేర్కొన్నారు. 

అయితే, జగన్ కు భద్రత తగ్గించారన్న వాదనలను పోలీసు శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేశాయి. నిబంధన మేరకే జగన్ కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని తెలిపాయి.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అదనంగా కల్పించే భద్రతనే ఇప్పుడు తగ్గించామని పోలీసు శాఖ వెల్లడించింది. జగన్ కు ఇప్పుడు సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చిచెప్పారు. 

కాగా, జూన్ 3వ తేదీ నాటికి తనకు 900 మంది పోలీసులతో భద్రత ఉండేదని, ఇప్పుడు కూడా అదే భద్రత కావాలని జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. జగన్ కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News