Graham Thorpe: ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్ కన్నుమూత
- ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటన
- ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్న ఈసీబీ
- ఇంగ్లండ్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరంటూ కితాబు
- 1993-2005 మధ్య ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడిన థోర్ప్
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (55) కన్నుమూశాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపింది. ఈ సందర్భంగా ఈసీబీ ఓ ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది.
"గ్రాహం థోర్ప్ ఇకలేరనే వార్త చాలా బాధ కలిగించింది. ఇంగ్లండ్ అత్యుత్తమ బ్యాటర్లలో ఆయన ఒకరు. ఆయన క్రికెట్ కుటుంబానికి ప్రియమైన సభ్యుడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో గౌరవించబడ్డాడు. ఆయన మృతితో క్రికెట్ ప్రపంచం నేడు శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన భార్య అమండా, పిల్లలు, తండ్రి జియోఫ్, కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ ప్రగాఢసానుభూతి" అని ఈసీబీ తన ప్రకటనలో పేర్కొంది.
గ్రాహం థోర్ప్ క్రికెట్ కెరీర్ ఇలా..
1993-2005 మధ్య ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 44.66 సగటుతో 16 సెంచరీల సాయంతో 6,744 పరుగులు చేశాడు. ఈ స్టైలిష్ ఎడమచేతి వాటం బ్యాటర్ వన్డేల్లో 37.18 సగటుతో 21 అర్ధసెంచరీలతో 2380 రన్స్ చేశాడు.
థోర్ప్ సర్రే తరపున 17 సంవత్సరాలు ఆడాడు. అక్కడ అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 241 మ్యాచ్‌లు, 271 లిస్ట్ -ఏ గేమ్‌లు ఆడాడు. కౌంటీ తరపున 20,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
సర్రే సీఈఓ స్టీవ్ ఎల్వర్తీ మాట్లాడుతూ... "క్లబ్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ గ్రాహం మరణించిన విషాద వార్తతో కృంగిపోయారు. అతను క్లబ్, దేశం కోసం గొప్ప విజయాలు అందించాడు. చాలా మంది క్రికెట్ అభిమానులకు హీరో" అని చెప్పుకొచ్చారు.
కాగా, గత రెండేళ్లుగా గ్రాహం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయన 2022 మార్చిలో ఆఫ్ఘనిస్థాన్ ప్రధాన కోచ్‌గా సెలక్ట్ అయ్యాడు. అయితే అతను జట్టులో చేరడానికి ముందే తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. గ్రాహం థోర్ప్ ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్, అసిస్టెంట్ కోచ్‌గా కూడా పనిచేశాడు. అయితే, 2022 ఫిబ్రవరిలో ఇంగ్లండ్ జట్టు యాషెస్‌లో 4-0తో ఓడిపోయిన తర్వాత పదవీవిరమణ చేశాడు.