Rohit Sharma: శ్రీలంకతో రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit Sharma termed defeat against Sri Lanka in the second ODI as hurting

  • రెండో వన్డే ఓటమి బాధ కలిగించిందన్న కెప్టెన్
  • మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యంపై చర్చిస్తామని వెల్లడి
  • దూకుడుగా ఆడడంతోనే తాను 65 పరుగులు సాధించానని వ్యాఖ్య

241 పరుగుల లక్ష్య ఛేదనలో 96 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోని జట్టు ఓడిపోతుందని ఎవరు భావిస్తారు. కానీ ఆదివారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు అనూహ్యంగా పరాజయం పాలైంది. 32 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. లంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే భారత బ్యాటింగ్ లైనప్‌ను పేకమేడలా కుప్పకూల్చాడు. ఏకంగా 6 వికెట్లు సాధించాడు. ఫలితంగా భారత్ 208 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రీలంక 1-0 తేడాతో లీడ్‌లో నిలిచింది.

ఈ ఓటమిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశాడు. ఈ పరాజయం బాధ కలిగిస్తోందని అన్నాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు ఏవిధంగా ఆడారనే దానిపై తాము చర్చించుకుంటామని చెప్పాడు. ఒక మ్యాచ్‌లో ఓడిపోతే అన్ని విషయాలు బాధ కలిగిస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించాడు. భారత్ 50 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయిన ఆ 10 ఓవర్ల గురించే తాను మాట్లాడడం లేదని, అన్ని అంశాలు చర్చించుకుంటామని పేర్కొన్నాడు. నిలకడగా క్రికెట్ ఆడాలని, అయితే ఆ విషయంలో తాము విఫలమయ్యామని అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమితో కొంచెం నిరాశ చెందామని, అయితే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని వ్యాఖ్యానించాడు.

రెండో వన్డేలో తాము తగినంతగా రాణించలేకపోయామని, మిడిల్ ఓవర్లలో తమ బ్యాటింగ్‌ వైఫల్యంపై చర్చిస్తామని రోహిత్ చెప్పాడు. భారత బ్యాటర్లు ఇక్కడి పిచ్‌లకు త్వరగా అలవాటుపడాల్సిన అవసరం ఉందని రోహిత్ పేర్కొన్నాడు. ఇక్కడి పిచ్‌లకు అనుగుణంగా మారాలని, లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌తో సులభంగా బ్యాటింగ్ చేయవచ్చునని తాము భావించామని, అయితే లంక స్పిన్నర్ జెఫ్రీకి ఘనత దక్కుతుందని, అతడు 6 వికెట్లు సాధించి మ్యాచ్‌ను శాసించాడని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

ఇక తాను దూకుడుగా బ్యాటింగ్ చేయడంతోనే 65 పరుగులు వచ్చాయని, తాను బ్యాటింగ్ చేసిన విధానమే అందుకు కారణమని రోహిత్ శర్మ చెప్పాడు. అయితే ఇలా బ్యాటింగ్ చేస్తే చాలా నష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఔట్ అయితే తీవ్ర నిరాశ మిగులుతుందని, కానీ రాజీపడకూడదని తాను నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. మ్యాచ్ అనంతర ప్రజెంటేషన్ ఈవెంట్‌లో ఈ మేరకు రోహిత్ శర్మ మాట్లాడాడు.

  • Loading...

More Telugu News