Team India: రెండో వన్డేలో టీమిండియా ఢమాల్... 6 వికెట్లతో చెలరేగిన వాండర్సే

Team India lost to Sr Lanka in 2nd ODI

  • కొలంబోలో టీమిండియా-శ్రీలంక రెండో వన్డే
  • 32 పరుగుల తేడాతో నెగ్గిన ఆతిథ్య జట్టు
  • మొదట 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 రన్స్ చేసిన లంక
  • 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా
  • అద్భుతంగా బౌలింగ్ చేసిన లంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే

టీమిండియాతో టీ20 సిరీస్ లో చిత్తుగా ఓడిన శ్రీలంక... వన్డే సిరీస్ లో సత్తా చాటుతోంది. తొలి వన్డేలో గెలుపు బాటలో పయనిస్తున్న టీమిండియాను కట్టడి చేసి ఆ మ్యాచ్ ను టైగా ముగించిన ఆతిథ్య శ్రీలంక జట్టు... నేడు రెండో వన్డే మ్యాచ్ లో సాధికారికంగా నెగ్గింది. టీమిండియాను 32 పరుగుల తేడాతో ఓడించింది. శ్రీలంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే 6 వికెట్లు తీసి భారత్ ను దెబ్బతీశాడు.

కొలంబోలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అనంతరం, 241 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది. 

టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 64, శుభ్ మాన్ గిల్ 35, అక్షర్ పటేల్ 44 పరుగులు చేశారు. కోహ్లీ (14), శివమ్ దూబే (0), శ్రేయాస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) నిరాశపరిచారు. 

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ తొలి వికెట్ కు 13.3 ఓవర్లలో 97 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ, మిగతా బ్యాట్స్ మెన్ సద్వినియోగం చేసుకోలేక, చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్నారు. లంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సేకు వికెట్లు అప్పగించి వెనుదిరిగారు. లంక కెప్టెన్ చరిత్ అసలంక 3 వికెట్లు తీసి భారత్ పతనంలో పాలుపంచుకున్నాడు. 

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో శ్రీలంక జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఈ నెల 7వ తేదీన ఇదే మైదానంలో జరగనుంది.

  • Loading...

More Telugu News