Team India: రెండో వన్డేలో టీమిండియా టార్గెట్ 241 రన్స్... శుభారంభం ఇచ్చిన ఓపెనర్లు
- కొలంబోలో రెండో వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
- 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు
- చేజింగ్ లో 12 ఓవర్లలో వికెట్ పడకుండా 84 పరుగులు చేసిన టీమిండియా
టీమిండియాతో రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. తొలి వన్డే తరహాలోనే ఈ మ్యాచ్ లో కూడా శ్రీలంక లోయర్ ఆర్డర్ ఎంతో విలువైన పరుగులు జోడించింది.
ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండ్ 40, వన్ డౌన్ లో వచ్చిన కుశాల్ మెండిస్ 30 పరుగులతో రాణించారు. కెప్టెన్ చరిత్ అసలంక 25 పరుగులు సాధించాడు. ఇక లోయర్ ఆర్డర్ లో దునిత్ వెల్లలాగే 39, కమిందు మెండిస్ 40 పరుగులు చేయడం విశేషం.
తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన వెల్లలాగే ఈ మ్యాచ్ లోనూ సాధికారికంగా ఆడాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, కుల్దీప్ యాదవ్ 2, మహ్మద్ సిరాజ్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.
ఇక, 241 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు అజేయంగా 12 ఓవర్లలో 84 పరుగులు జోడించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 55, శుభ్ మాన్ గిల్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 38 ఓవర్లలో 157 పరుగులు చేయాలి. చేతిలో 10 వికెట్లున్నాయి.