Lakshya Sen: పారిస్ ఒలింపిక్స్‌లో లక్ష్యసేన్ చరిత్ర.. మెన్స్ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరువ

Lakshya Sen created history after reaching the semi finals of the mens singles badminton event at the Paris Olympics 2024

  • చైనీస్ తైపీ ప్లేయర్ తియెన్ చెన్ చౌపై 19-21, 21-15, 21-12 తేడాతో విజయం
  • పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్
  • చరిత్రకు అడుగు దూరంలో భారత బ్యాడ్మింటన్ స్టార్

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో సెమీ-ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించాడు. చైనీస్ తైపీకి చెందిన ప్లేయర్ తియెన్ చెన్ చౌపై 19-21, 21-15, 21-12 తేడాతో విజయం సాధించాడు. దీంతో ఒలింపిక్స్‌ క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో సెమీ ఫైనల్‌ చేరుకున్న భారత తొలి ఆటగాడిగా లక్ష్యసేన్ రికార్డులకు ఎక్కాడు.

రసవత్తరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ సెట్‌లో 21-19 తేడాతో లక్ష్య సేన్ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాతి రెండు గేమ్‌లలో అద్భుతంగా పుంజుకున్నాడు. రిటర్న్ సర్వ్‌లను మెరుగుపరుచుకుని చూడచక్కనైన షాట్లు ఆడాడు. ప్రత్యర్థి ఆటగాడి షాట్లను తెలివిగా అంచనా వేసి రెండో సెట్‌లో 21-15తో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. 

ఇక నిర్ణయాత్మకమైన మూడవ సెట్‌లో లక్ష్యసేన్ మరింత చెలరేగాడు. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. తియెన్ చెన్ స్కోరు సాధించకుండా నిలువరించి 21-12తో మూడవ సెట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో ఒలింపిక్స్ చరిత్రలో చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుని సెమీ ఫైనల్‌కు చేరాడు. 

పారిస్‌ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ విభాగంలో లక్ష్యసేన్ మాత్రమే ప్రస్తుతం నిలిచాడు. మిగతా భారత ప్లేయర్లు ఇప్పటికే ఇంటిముఖం పట్టారు. గురువారం జరిగిన క్వార్టర్-ఫైనల్ రౌండ్‌లో లక్ష్య సేన్ చేతిలో హెచ్‌ఎస్ ప్రణయ్‌ ఓటమిపాలయ్యాడు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన పీవీ సింధు కూడా రౌండ్-16 దశలోనే నిష్క్రమించింది. ఇక పురుషుల డబుల్స్ క్వార్టర్-ఫైనల్స్‌లో భారత జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి జోడీ కూడా అనూహ్య రీతిలో ఓటమిపాలైంది.

కాగా గత మూడు ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ బ్యాడ్మింటన్‌ విభాగంలో పతకాలు సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం గెలుచుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలను ఆమె సాధించింది. కాగా పారిస్ ఒలింపిక్స్‌లో లక్ష్య సేన్ మరో మ్యాచ్ గెలిస్తే పతకం సాధించి చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది.

  • Loading...

More Telugu News