CRDA: సీఆర్డీఏ పరిధి 8,252 చ.కి.మీ ఉండేలా నిర్ణయించాం: మంత్రి నారాయణ

Minister Narayana told media CRDA meeting details
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం
  • మీడియాకు వివరాలు తెలిపిన మంత్రి నారాయణ
  • కోర్ క్యాపిటల్ పరిధి తిరిగి 217 చ.కి.మీ ఉండేలా నిర్ణయం
  • సీఆర్డీఏ కోసం 32 మంది కన్సల్టెంట్ల నియామకంపై నిర్ణయం
  • న్యాయ పరిశీలన తర్వాత ఆర్-5 జోన్ పై కార్యాచరణ 
  • అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై 6 ఐకానిక్ బ్రిడ్జిలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధానిలో సోమ, మంగళవారాల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామని చెప్పారు. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలను సంప్రదిస్తామని, ఆయా సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువును మరో రెండేళ్లకు పెంచామని వెల్లడించారు. 

హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని నేటి సమావేశంలో నిర్ణయించామని మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏలో 778 మంది ఉద్యోగులను నియయమించుకుంటామని పేర్కొన్నారు. అంతేకాకుండా, సీఆర్డీఏ కోసం 32 మంది కన్సల్టెంట్లను నియమించుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. 

ముఖ్యంగా... 8,352.69 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీఆర్డీఏ ఉండేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అదే సమయంలో కోర్ క్యాపిటల్ పరిధి తిరిగి 217 చదరపు కిలోమీటర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని నారాయణ చెప్పారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణంపై సింగపూర్ ప్రతినిధులను సంప్రదిస్తామని వెల్లడించారు. 

నాలుగు లేన్లుగా కరకట్ట నిర్మాణం చేపడతామని, అమరావతికి ఓఆర్ఆర్, ఈఆర్ఆర్ ఉంటాయని వివరించారు. అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై 6 ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మిస్తామని తెలిపారు. 

ఇక, న్యాయ పరిశీలన తర్వాత ఆర్-5 జోన్ పై కార్యాచరణ ప్రారంభించాలని నేటి సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయించినట్టు మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా నిర్మాణంపై సింగపూర్ ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని అన్నారు.
CRDA
Amaravati
AP Capital
P Narayana

More Telugu News