Revanth Reddy: గవర్నమెంట్ టీచర్లు చెప్పిన చదువుతో... ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy praises government teachers

  • అసెంబ్లీలో ఒకాయన అమెరికాలో చదివానని గొప్పగా చెప్పాడన్న సీఎం
  • తాను మాత్రం గవర్నమెంట్ స్కూళ్లలో చదివి ఈ స్థాయికి ఎదిగానన్న సీఎం
  • ఉపాధ్యాయుల చేతిలో తెలంగాణ భవిష్యత్తు ఉందన్న రేవంత్ రెడ్డి

మొన్న అసెంబ్లీలో ఒకాయన మాట్లాడుతూ తాను గుంటూరులో, పూనాలో, అమెరికాలో చదువుకున్నానని చెబుతున్నాడని, తనకు గొప్పగొప్ప చదువులు వచ్చునని చెప్పే ప్రయత్నం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. నువ్వు ఎక్కడ చదివావు అంటూ ఆ వ్యక్తి నన్ను వెటకారంగా మాట్లాడే ప్రయత్నం చేశాడన్నారు. కానీ నేను కొండారెడ్డిపల్లెలో, తాండ్ర, వనపర్తి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలలో చదువుకున్నానని చెప్పానన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో... ప్రభుత్వ టీచర్లు చెప్పిన చదువుతోనే తాను జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిని అయ్యానని ఆయనకు చెప్పానన్నారు. ప్రభుత్వ టీచర్లు చెప్పిన చదువుతో తాను సీఎంను అయ్యానని... ఎవరికీ తలవంచకుండా ఆత్మగౌరవంతో నిటారుగా నిలబడ్డానన్నారు. ఏ ప్రభుత్వ టీచర్లు చదువు చెబితే ఈ స్థాయికి ఎదిగామో... ఆ టీచర్లను కలిసేందుకు ఈ సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు.

పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  కోదండరాంకు విజ్ఞప్తి చేసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కృషి చేసిన ఉపాధ్యాయులను కలవాలని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు ఎక్కడ ఉందని అడిగితే ఎల్బీ  స్టేడియంలో ఉందని చెబుతానన్నారు. ఇవాళ ఎల్బీ స్టేడియానికి విచ్చేసిన వేలాది మంది ఉపాధ్యాయుల చేతిలో తెలంగాణ భవిష్యత్తు ఉందన్నారు.

తమ పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చేతిలో పెట్టారని, వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. రాష్ట్రం సాధించిన తర్వాత ఉపాధ్యాయులకు గౌరవం దక్కుతుందనుకున్నామని, కానీ అది జరగలేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉపాధ్యాయులకు గౌరవం లేదని విమర్శించారు. విద్యకు బడ్జెట్‌లో రూ.21 వేల కోట్లు కేటాయించామన్నారు.

ఉమ్మడి రాష్ట్రం కంటే బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగుల పరిస్థితులు దిగజారాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలోని లోపాలను సరిచేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానించిందని ఆరోపించారు. దళిత, ఆదివాసీ, బీసీ బిడ్డలు ఈరోజు ఉన్నత చదువులు చదవాలన్నారు.

  • Loading...

More Telugu News