Revanth Reddy: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం: సీఎం రేవంత్ రెడ్డి

Another international cricket stadium to come up in Hyderabad

  • త్వరలో క్రీడా పాలసీ... హర్యానా రాష్ట్ర విధానాన్ని పరిశీలిస్తున్నామన్న సీఎం
  • సిరాజ్‌కు విద్యార్హత లేకపోయినప్పటికీ గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నట్లు వెల్లడి
  • భూమి ఉంటే మండలానికో మినీ స్టేడియానికి నిధులు ఇస్తామన్న సీఎం

క్రీడల విషయంలో హర్యానా రాష్ట్రం విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్‌లకు డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై శాసనసభలో చర్చ జరిగింది. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... త్వరలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ను బ్యాగరికంచెకు షిఫ్ట్ చేయాలని భావిస్తున్నామన్నారు. అక్కడే స్కిల్ యూనివర్సిటీ పక్కన మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం బీసీసీఐతో చర్చించామన్నారు. అంతర్జాతీయస్థాయి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలని బీసీసీఐని కోరామని, వారు కూడా అందుకు ముందుకు వచ్చారన్నారు. స్పోర్ట్స్ కోసం నిధులతో పాటు ప్రత్యేక కార్యాచరణ ఉంటుందన్నారు.

క్రీడాకారులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. నిఖత్ జరీన్‌కు ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. సిరాజ్‌కు విద్యార్హత లేకపోయినప్పటికీ గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పారు.

రానున్న అసెంబ్లీ సమావేశాలల్లో స్పోర్ట్స్ పాలసీని ప్రవేశ పెడతామన్నారు. స్పోర్ట్స్ స్టేడియంల ఏర్పాటును ప్రోత్సహించే అంశంపై దృష్టి సారించామన్నారు. బీజేపీ సభ్యుడు చెప్పినట్లు మండలానికి ఓ మినీ స్టేడియం నిర్మిస్తే ఉపయోగంగా ఉంటుందన్నారు. కానీ తెలంగాణలో భూముల విలువ బాగా పెరిగి.. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు లేకుండా పోయాయన్నారు. ఏ మండల కేంద్రంలోనైనా ప్రభుత్వ భూమి ఉంటే స్టేడియం నిర్మాణానికి బడ్జెట్ కేటాయించేందుకు తాము సిద్ధమన్నారు. 

యువతను వ్యసనాల నుంచి బయటకు తీసుకురావడానికి క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఈ సభపై ఆ బాధ్యత ఉందన్నారు. సభ్యులు సూచనలు, సలహాలు ఇస్తే క్రీడావిధానానికి పరిశీలిస్తామన్నారు. 

యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియం సినిమా ఫంక్షన్లకు అంకితమైతే, గచ్చిబౌలిలోని స్టేడియం పెళ్లిళ్లు, పేరంటాలకు, సరూర్ నగర్ స్టేడియం, ఎల్బీనగర్ స్టేడియం రాజకీయ పార్టీల సమావేశాలకు ఉపయోగిస్తున్నారన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే బడ్జెట్‌లో క్రీడల కోసం రూ.321 కోట్లు కేటాయించామన్నారు.

  • Loading...

More Telugu News