Vishal: ఇది షూటింగ్ కాదు.. అతి తెలివి ప్రదర్శించొద్దు.. నటుడు విశాల్‌పై హైకోర్టు ఆగ్రహం

Madras High Court Fires On Kollywood Actor Vishal

  • విశాల్ తమ నుంచి రూ. 21.29 కోట్లు అప్పుగా తీసుకుని ఇవ్వడం లేదంటూ కోర్టుకు లైకా ప్రొడక్షన్స్
  • రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని, అప్పటి వరకు సినిమాలు విడుదల చేయొద్దని విశాల్‌కు కోర్టు ఆదేశం
  • కోర్టు ఆదేశాలను విశాల్ ఉల్లంఘించాడంటూ మరోమారు కోర్టుకు లైకా
  • విశాల్‌ను హెచ్చరిస్తూ నేటికి విచారణ వాయిదా వేసిన హైకోర్టు

‘‘ఇది షూటింగ్ కాదు.. అతి తెలివి ప్రదర్శించవద్దు’’ అంటూ కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా తీస్తానని విశాల్ తమ నుంచి రూ. 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడని, ఆ డబ్బులు ఇప్పటికీ ఇవ్వడం లేదంటూ 2022లో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా లైకా సంస్థకు విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని, తన ఆస్తి వివరాలను సమర్పించాలని విశాల్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు ఆయన నటించి, నిర్మించిన సినిమాలేవీ థియేటర్లలో కానీ, ఓటీటీల్లో కానీ విడుదల చేయకుండా స్టే విధించింది.

అయితే, కోర్టు తీర్పును ఉల్లంఘించారని, డబ్బులు డిపాజిట్ చేయకపోవడమే కాకుండా ఆయన నటించి, నిర్మించిన సినిమాలను కూడా విడుదల చేశారంటూ ఈ ఏడాది జూన్‌లో లైకా సంస్థ మరోమారు కోర్టును ఆశ్రయిస్తూ విశాల్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేసింది. అయితే, అప్పుడు ఆధారాలను చూపించడంలో సంస్థ విఫలం కావడంతో విచారణ పలుమార్లు వాయిదా పడింది.

తాజాగా, ఈ కేసులో గురువారం విశాల్ తన వాదనలు వినిపించేందుకు కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా లైకా సంస్థతో జరిగిన ఒప్పందంపై విశాల్‌ను కోర్టు ప్రశ్నించింది. అయితే, అది తన దృష్టికి రాలేదని, ఖాళీ పేపర్‌పై సంతకం మాత్రమే చేశానని బదులిచ్చారు. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ కాగితంపై మీరెలా సంతకం చేస్తారని ప్రశ్నించారు. తెలివిగా సమాధానం చెబుతున్నానని అనుకోవద్దని, ఇది మీ సినిమా షూటింగ్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తెలివి ప్రదర్శించవద్దని, జాగ్రత్తగా బదులివ్వాలని సూచించారు. 

ఆ తర్వాత ‘పందెంకోడి 2’ విడుదలకు ముందే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చారా? అని కోర్టు ప్రశ్నించగా.. విశాల్ సమాధానం ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు.  దీంతో న్యాయమూర్తి మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రవర్తిస్తే కుదరదని, అవుననో, కాదనో సమాధానం చెప్పాలని ఆదేశించారు. దీంతో విశాల్ నోరు తెరిచారు. లైకా నుంచి డబ్బు అప్పుగా తీసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. దీంతో కేసు విచారణను నేటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.

  • Loading...

More Telugu News