Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి రూ.584 కోట్ల బడ్జెట్

ICC approved budget of 70 million USD to the upcoming Champions Trophy 2025

  • వ‌చ్చే ఏడాది పాకిస్థాన్ లో ఛాంపియన్స్‌ ట్రోఫీ
  • ట్రోఫీ నిర్వ‌హ‌ణ‌కు బడ్జెట్‌ను ఆమోదించిన ఐసీసీ
  • అదనపు ఖర్చులకు మ‌రో రూ.34 కోట్లు కేటాయించినట్లు ఐసీసీ వర్గాలు వెల్ల‌డి

వ‌చ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి 70 మిలియన్ డాలర్ల (రూ.584 కోట్లు) బడ్జెట్ కు ఐసీసీ గురువారం ఆమోదం తెలిపింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఐసీసీ ఆర్థిక శాఖ సంయుక్తంగా రూపొందించిన బడ్జెట్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా నేతృత్వంలోని ఆర్థిక, వాణిజ్య కమిటీ ఆమోదించింది. ఇక అదనపు ఖర్చులకు మ‌రో 4.5 మిలియన్ డాలర్లు (రూ.34 కోట్లు) కేటాయించినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. ఒక‌వేళ పాక్‌లో టీమిండియా పర్యటించడానికి నిరాకరించిన సందర్భంలో కొన్ని మ్యాచ్‌లు ఇతర వేదికలలో నిర్వ‌హించేందుకు ఈ బ్యాకప్ ఫండ్‌ ను ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఈ బడ్జెట్‌ సరిపోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్ జై షా ఇటీవల రాబోయే ఆసియా కప్ టోర్నీ వేదికలను నిర్ణయించడంలోనూ కీలక పాత్ర పోషించారు. టీ20 ఫార్మాట్ లో జరిగే 2025 ఆసియా కప్ ఇండియాలో జరగనున్న విష‌యం తెలిసిందే. అలాగే 2027 ఆసియా కప్ అనేది 50 ఓవర్ల ఫార్మాట్ లో బంగ్లాదేశ్ లో జ‌ర‌గ‌నుంది.

దాయాదుల పోరు వ‌ల్లే ఐసీసీకి లాభాలు
భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచుల వల్లే ఐసీసీకి లాభాలు వస్తాయని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్‌ మళ్లీ ఒకే గ్రూప్‌లో ఉంటాయని సూపర్ ఫోర్ దశలో కూడా తలపడవచ్చని, రెండు జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తే మూడో మ్యాచ్ కూడా జరుగుతుంద‌ని తెలిపారు.

2023 ఆసియా కప్‌ నుంచి లాభాలు
గత ఆసియా కప్‌ సమయంలో గందరగోళం, చివరి నిమిషంలో వేదిక మార్పులు, అదనపు ఖర్చులు ఉన్నప్పటికీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ లాభాలు పొందడం గ‌మ‌నార్హం. 2023లో ఆసియా కప్ కి పాకిస్థాన్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు భారత్‌, పాక్‌లో పర్యటించేందుకు నిరాకరించడంతో శ్రీలంకలో మ్యాచ్ లు నిర్వహించారు. వర్షం కారణంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఓ మ్యాచ్‌ రద్దయినప్పటికీ, టోర్నీ నిర్వహణ లాభాలు తెచ్చిపెట్టిందని జై షా తెలిపారు.

  • Loading...

More Telugu News