Madhya Pradesh: దినసరి కూలీని వరించిన అదృష్టం.. మట్టిలో రూ.80 లక్షల వజ్రం లభ్యం

Madhyapradesh Daily wage earner finds 80 lakh worth diamond

  • పదేళ్ల పాటు ప్రభుత్వ స్థలాల్లో వెతగ్గా లభించిన 19.22 కారెట్ల వజ్రం
  • తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్న కూలీ
  • వజ్రం అమ్మగా వచ్చే డబ్బుతో ఇల్లు కట్టుకుని పొలం కొనుక్కుంటానని వెల్లడి

వజ్రాల కోసం పదేళ్లుగా వెతుకుతున్న మధ్యప్రదేశ్ లోని ఓ దినసరి కూలీని ఎట్టకేలకు అదృష్టం వరించింది. రోజుకు రూ.300కు పనిచేసే అతడికి ఏకంగా రూ.80 లక్షల విలువైన వజ్రం లభించడంతో ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. రాజు గోండ్ (40) రోజు కూలీగా రెక్కల కష్టంతో తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక రాష్ట్రంలోని పన్నా గనులు ఎంతో ఫేమస్. ఇక్కడ తరచూ వజ్రాలు దొరుకుతుంటాయి. అక్కడ ఓపిగ్గా వెతికితే వజ్రాలు లభిస్తాయని రాజు గోండ్, అతడి సోదరుడు రాకేశ్‌ విశ్వాసం. 

దీంతో, రోజుకు రూ.300 సంపాదించే రాజు అప్పుడప్పుడూ ప్రభుత్వానికి రోజుకు రూ.800 చెల్లించి అక్కడ వజ్రాల కోసం వెతుకుతుంటాడు. వజ్రం కోసం పదేళ్లుగా అతడు పడుతున్న ప్రయాస ఎట్టకేలకు ఫలించింది. ఇటీవల అతడికి ఏకంగా రూ.80 లక్షల విలువైన 19.22 కారెట్ల వజ్రం లభించింది. ‘‘అది అద్భుతంగా మెరిసింది. చూడగానే అది వజ్రమన్న విషయం నాకు అర్థమైంది’’ అని రాజు మీడియాకు తెలిపాడు. వజ్రం దొరకగానే ఆ సోదరులు ఆలస్యం చేయకుండా పన్నా డైమండ్ కార్యాలయానికి వెళ్లి చూపించారు. అక్కడి అధికారులు రాయిని పరిశీలించి నిజమైన వజ్రంగా ధ్రువీకరించారు. 1961లో ఓ వ్యక్తికి 54.55 కారెట్ల వజ్రం లభించిందని, 2018లో మరో వ్యక్తికి 42 కారెట్ల వజ్రం లభించిందని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. 

ప్రభుత్వ స్థలాల్లో వజ్రాల కోసం వెతికేందుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని రాజు గోండ్ పేర్కొన్నాడు. ‘‘ముందుగా ఓ దరఖాస్తును నింపాలి. ఐడీ ప్రూఫ్, ఫొటోలు, రూ.800 ఫీజు ప్రభుత్వానికి కట్టాలి. ఒక ప్రాంతంలో వెతుకులాట ముగిశాక మరో ప్రాంతంలో గాలింపు చేసేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి’’ అని వివరించాడు. వజ్రం లభించడంతో తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని సంబరపడిపోయాడు. భారీ వజ్రాలు లభించడం నానాటికీ అరుదైపోతున్న నేపథ్యంలో రాజుకు పట్టిన అదృష్టాన్ని చూసి స్థానికులూ ఆశ్చర్యపోతున్నారు. వజ్రం అమ్మితే వచ్చే డబ్బును తన కుటుంబం అవసరాలు, పిల్లల చదువులపై ఖర్చు చేస్తానని రాజు తెలిపాడు. ముందుగా తనకున్న రూ.5 లక్షల అప్పును తక్షణం వదిలించుకుంటానని అన్నాడు. మిగిలిన సొమ్ముతో ఓ ఇల్లు కట్టుకుని, కొంత భూమిని కూడా కొనుక్కుంటానని వివరించాడు.

  • Loading...

More Telugu News