Nara Lokesh: మమ్మల్ని మన్నించండి కామ్రేడ్: మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్

Minister Nara Lokesh appeal for left party leaders

  • చంద్రబాబు మడకశిర పర్యటన సందర్భంగా వామపక్ష నేతల ముందస్తు అరెస్ట్‌లు
  • అరెస్ట్‌లను ఖండించిన సీపీఎం
  • అప్రజాస్వామిక అరెస్ట్‌లకు తాము వ్యతిరేకమన్న లోకేశ్
  • ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కులను కాపాడుతామని హామీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను మన్నించమని కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. లెఫ్ట్ నాయకులను మన్నించాలని ఆయన కోరడానికి ఓ కారణం ఉంది! గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన పర్యటన నేపథ్యంలో సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌‍ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ స్పందించారు.

'మమ్మల్ని మన్నించండి కామ్రేడ్. సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదు.

ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News