Revanth Reddy: స్కిల్ వర్సిటీలో ప్రారంభించనున్న 6 కోర్సులివే: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy about skill university

  • స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ
  • కాంగ్రెస్ వేసిన పునాదితోనే హైదరాబాద్‌లో ఐటీ రంగం వేళ్ళూనుకుందన్న సీఎం
  • 2 వేల మందితో స్కిల్ వర్సిటీలో ఆరు కోర్సులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడి

కాంగ్రెస్ వేసిన పునాదితోనే హైదరాబాద్‌లో ఐటీ రంగం వేళ్లూనుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్కిల్ వర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్కిల్ వర్సిటీలో మొత్తం ఆరు కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 6 కోర్సులతో ప్రారంభిస్తామని, విద్యార్థుల విలువైన సమయాన్ని వృథా చేయవద్దనే ఉద్దేశంతో ఈసారి 2 వేలమందితో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ప్రారంభించనున్న ఆరు కోర్సులను ఆయన సభలో ప్రకటించారు. 

1. స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ 2. స్కూల్ ఆఫ్ ఈకామర్స్ అండ్ లాజిస్టిక్స్ 3. స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ 4. స్కూల్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ 5. స్కూల్ ఆఫ్ రిటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్ 6. స్కూల్ ఆఫ్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్... అని రేవంత్ రెడ్డి వివరించారు.

కాగా... విద్య, నీటిపారుదలకు నెహ్రూ తొలి ప్రాధాన్యత ఇచ్చారని రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. నెహ్రూ మారుమూల ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పేదవాడికి విద్య అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాడు రిజర్వేషన్లను తీసుకువచ్చింది అన్నారు.

రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఇందుకు కాంగ్రెస్ కారణమన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధి పథంలో నడిపేందుకు నెహ్రూ పునాది వేశారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇందిరాగాంధీ ఉపకార వేతనాలు అందించారని పేర్కొన్నారు. అన్నివర్గాలకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పారని గుర్తు చేశారు. 

దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీయే అన్నారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి పునాదిరాయి వేశారని తెలిపారు. కాంగ్రెస్ వేసిన పునాదిరాయితోనే హైదరాబాద్‌లో ఐటీ రంగం వేళ్లూనుకుందన్నారు. ప్రపంచంలో ఉన్న ఐటీ నిపుణుల్లో నలుగురు భారతీయుల ఉంటే అందులో ఒకరు తెలుగువారు ఉంటారని పేర్కొన్నారు. 


  • Loading...

More Telugu News