Ismail Haniyehs assassination: ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ అధినేత ఆదేశాలు.. తీవ్ర ఉద్రిక్తత!

Reports saying that Irans Supreme Leader orders direct attack on Israel after Ismail Haniyehs assassination

  • హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా దాడికి ఆదేశాలు
  • హత్య జరిగిన వెంటనే ఇరాన్ అధినేత అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం
  • ముగ్గురు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు వెలువడుతున్న కథనాలు

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యతో మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలంటూ ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు ఇచ్చారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇస్మాయిల్ హత్యకు గురైనట్లు మీడియాలో వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగిందని, ఈ భేటీలో అధ్యక్షుడు ఖమేనీ దాడికి ఆదేశాలు ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ముగ్గురు అధికారులకు ఆదేశాలు వెళ్లాయని, ఇందులో ఇద్దరు రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు కూడా ఉన్నారని పేర్కొంది.

కాగా హమాస్ అధినేత ఇస్మాయిల్ హత్య ఇజ్రాయెల్ పనేనని ఇరాన్, హమాస్ బలంగా నమ్ముతున్నాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం తమ ప్రమేయం లేదని ఖండించింది. అయితే విదేశాలలో శత్రువులను మట్టుబెట్టిన చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉండడంతో ఇస్మాయిల్ హత్యలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని ఇరాన్ విశ్వసిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

హమాస్ చీఫ్ హతం
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. మంగళవారం టెహ్రాన్‌లోని ఇస్మాయిల్ నివాసంపై జియోనిస్టులు జరిపిన దాడిలో ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారని హమాస్ నిర్ధారించింది. పాలస్తీనాలో యూదుల హక్కులు, ప్రత్యేక రాజ్యం కోసం పోరాడుతున్న జియోనిస్టులు జరిపిన ఈ దాడిపై దర్యాప్తు కొనసాగుతోందని హమాస్ తెలిపింది. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇస్మాయిల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ వెళ్లారు.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధానికి దగ్గరగా వచ్చి వెనక్కి తగ్గాయి. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి ఇజ్రాయెల్ కారణమంటూ ప్రతీకారంగా వందలాది క్షిపణులు, డ్రోన్‌తో ఇరాన్ దాడి చేసింది. వీటిని ఇజ్రాయెల్‌ ఆర్మీ తిప్పికొట్టిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News