Revanth Reddy: నా అంతట నేనే అడిగినా ముందుకు రాలేదు: టాలీవుడ్‌పై రేవంత్ రెడ్డి అసంతృప్తి

Revanth Reddy unhappy with Tollywood

  • గద్దర్ అవార్డులు ఇస్తామని చెబితే టాలీవుడ్ నుంచి స్పందన లేదన్న సీఎం
  • గద్దర్ అవార్డుల అంశంపై సినీ పరిశ్రమ మౌనంగా ఉందని వ్యాఖ్య
  • సినీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్న సీఎం

తెలుగు సినిమా పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు తెలుగు పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ... నంది అవార్డులలా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వాలనుకుంటోందని, కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి దీనిపట్ల స్పందన రాలేదనీ అన్నారు.

'నా అంతట నేను అడిగినా కూడా ఎవరూ ముందుకు రావడం లేద'ని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డుల అంశంపై సినిమా పరిశ్రమ మౌనంగా ఉంటోందన్నారు. సినీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. 

రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

'నేను వారికి (టాలీవుడ్) గుర్తు చేయదలుచుకున్నా. గతంలో ఇదే వేదిక నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పాను. సినీ ప్రముఖులు, బాధ్యత వహిస్తున్నవారు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకురావాలని ఈ వేదిక మీది నుంచి విజ్ఞప్తి చేశాను. కానీ ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు.

తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి... మీ విజ్ఞప్తి కంటే ముందే నేను ఓ ప్రకటన చేశాను. నంది అవార్డులంత గొప్పగా మా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని చెప్పాను. తెలంగాణ జాతి మేలి రత్నం గద్దర్ పేరున గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పాం. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు.

ఇప్పటికైనా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను... ఈ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్తే... మా ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతుందని తెలియజేస్తున్నాను' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News