Nagababu: అమాయకుడైన జగన్ కు కూటమి ప్రభుత్వం న్యాయం చెయ్యాలి: నాగబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ 2019 ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడని, ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి అయ్యాడని, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడని వివరించారు. జగన్ కు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని తెలిపారు.
"ఎందుకంటే... 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేశాడు. ఐదేళ్లయినా కూడా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్ మోహన్ రెడ్డిగారికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కుదర్లేదు... ఇప్పుడాయన ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం అత్యవసరంగా ఆయనకి న్యాయం చెయ్యాల్సిన అవసరం ఉంది.
అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్తుడికి సరైన శిక్ష విధించాలి కదా! అందుకే ఆ కేసును తక్షణమే విచారించి అమాయకుడు అయిన జగన్ మోహన్ రెడ్డి గారికి న్యాయం చెయ్యాలని కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, హోంమంత్రి గారిని కోరుకుంటున్నాను" అని నాగబాటు ట్వీట్ చేశారు.