Anagani Sathya Prasad: టైమొస్తే పెద్దిరెడ్డి అయినా, జగన్ అయినా చర్యలు తప్పవు: మంత్రి అనగాని
- మదనపల్లె ఘటనలో ముగ్గురిని సస్పెండ్ చేశామన్న రెవెన్యూ మంత్రి అనగాని
- ఈ ఘటనలో ఎంతటి వ్యక్తులున్నా శిక్షార్హులేనని స్పష్టీకరణ
- ఫైళ్ల దగ్ధం ఘటనకు బాధ్యులెవరూ తప్పించుకోలేరని వ్యాఖ్యలు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో ముగ్గురిని సస్పెండ్ చేశామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మదనపల్లె ఘటనలో కుట్రకోణం దాగి ఉందని స్పష్టం చేశారు. మదనపల్లె ఘటనలో ఎంతటి వ్యక్తులు ఉన్నా శిక్షార్హులేనని స్పష్టం చేశారు. టైమొస్తే పెద్దిరెడ్డి అయినా, జగన్ అయినా చర్యలు తప్పవని మంత్రి అనగాని వ్యాఖ్యానించారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలో గతంలో కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూములపై సమీక్షిస్తామని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన భూములను లక్షల రూపాయలకే కేటాయిస్తారా? ఈ ఘటనకు బాధ్యులెవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
"రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేని పరిస్థితి నెలకొంది. రెవెన్యూ కార్యదర్శి సిసోడియా మూడ్రోజుల పాటు మదనపల్లెలోనే ఉన్నారు. మదనపల్లె ఘటనపై అధ్యయనం చేసి సీఎంకు నివేదిక ఇచ్చారు. మదనపల్లెలో జరిగిన అక్రమాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చాం.
అసైన్డ్ భూముల సమస్యలపై కూడా రెవెన్యూ శాఖ అధ్యయనం చేస్తోంది. ఎన్ని భూములు 22ఏ కింద ఉన్నాయి... ఎన్ని తొలగించారు? అనేది పరిశీలించాల్సి ఉంది. వైసీపీ హయాంలో భారీగా భూ పందేరాలు చేశారు... ప్రైవేటు వ్యక్తులకు భూములు దోచిపెట్టారు. దోచిపెట్టిన భూములను వెనక్కి తీసుకోవడంపై సమీక్ష చేపట్టాం.
భూ సర్వే పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. భూసర్వే ఇబ్బందులను గ్రామసభల్లో పరిష్కరించుకోవాలి. జగన్ పేరిట 77 లక్షల హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. ఆ సరిహద్దు రాళ్లు తొలగించేందుకు రూ.15 కోట్లు ఖర్చవుతుంది. క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు సిద్ధం చేస్తున్నాం" అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు.