Revanth Reddy: హరీశ్ రావు ఆ లెక్కలు మాత్రం చెప్పడంలేదు... విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy challenges BRS leaders

  • గొర్రెల పంపిణీ, బతుకమ్మ చీరల్లో భారీ అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి
  • లక్షల కోట్ల విలువైన అవుటర్ రింగ్ రోడ్డును రూ.7 వేల కోట్లకే అమ్మేశారని ఆగ్రహం
  • కేసీఆర్ కిట్ల విషయంలోనూ విచారణ జరిపిస్తామని వెల్లడి 

గొర్రెల పంపిణీ, బతుకమ్మ చీరల విషయంలో భారీ అవినీతి జరిగింది... బీఆర్ఎస్ నేతలు విచారణకు సిద్ధమా? అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. 

గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతికి పాల్పడ్డారు, సూరత్ నుంచి కిలోల లెక్కన చీరలు తెచ్చి బతుకమ్మ చీరల పేరిట  పంపిణీ చేశారు, లక్షల కోట్ల విలువ చేసే అవుటర్ రింగ్ రోడ్డును రూ.7 వేల కోట్లకు అమ్మేశారు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.  

అవుటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్లు ఉంటుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన రీతిలో ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మించింది. కానీ లక్షల కోట్ల విలువ చేసే అవుటర్ రింగ్ రోడ్డును పల్లీ బఠాణీలకు అమ్మినట్టు అమ్మేశారు. గొర్రెల పథకంలో ఎన్ని గొర్రెలు ఇచ్చారో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ లెక్కలన్నీ ఉన్నాయి. ఏసీబీ వాళ్లు పైపైన విచారణ చేస్తేనే రూ.700 కోట్ల అవినీతి తేలింది. బీఆర్ఎస్ సభ్యులు కోరుకుంటే కేసీఆర్ కిట్లలో ఏం అవినీతి జరిగిందో కూడా విచారణ చేయిస్తాం. 

ఇదేకాకుండా, చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నామంటూ బతుకమ్మ చీరల పథకం తెచ్చారు. ఇదొక గొప్ప పథకం అన్నారు. కానీ సూరత్ వెళ్లి కిలోల లెక్కన చీరలు తెచ్చి ఆడబిడ్డలను మభ్యపెడితే, ఆడబిడ్డలే వీధుల్లోకి వచ్చి ఆ చీరలను తగులబెట్టారు. ఆ చీరలను ఆడబిడ్డలు ఎవరూ కట్టుకోవడంలేదు. పొలాల్లో పిట్టలను తరమడానికి ఆ చీరలు ఉపయోగిస్తున్నారు. బతుకమ్మ అనేది తెలంగాణ మహిళలకు ఓ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ను కూడా దోపిడీకి ఉపయోగించుకున్నారు. 

ఇక, రంగారెడ్డి జిల్లాలో ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములు విక్రయించారో కూడా లెక్కలు తీస్తాం. హరీశ్ రావు అప్పుల లెక్కలు చెబుతున్నాడు కానీ, అమ్ముకున్న లెక్కలు చెప్పడంలేదు. ప్రజలు ఎన్నికల్లో శిక్షించిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు వీడడం లేదని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News