Traffic Rules Violation: పిల్లలతో కలిసి కారులో ప్రయాణమా? ఈ తప్పు అస్సలు చేయొద్దు!

Man Drives Car With Daughter On His Lap Video Sparks Concern

  • నాలుగేళ్ల కూతురిని ఒళ్లో కూర్చోపెట్టుకుని కారు నడిపిన తండ్రి
  • ఈ చర్యతో ప్రాణాపాయం తప్పదంటూ వీడియోను షేర్ చేసిన నెటిజన్
  • ఇలాంటి సందర్భంలో యాక్సిడెంట్ జరిగితే తండ్రీకూతురూ ఇద్దరూ మరణిస్తారని హెచ్చరిక
  • తల్లిదండ్రులెవరూ ఈ పొరపాటు చేయకూడదని హెచ్చరిక

పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు తెలియక చేసే ఓ ఘోర తప్పిదానికి సంబంధించిన వీడియోను డా. అశ్విన్ రజనీశ్ అనే డాక్టర్ నెట్టింట పంచుకున్నారు. ఇలాంటి తప్పు ఎవరూ చేయకూడదనే ఉద్దేశంతోనే తానీ వీడియోను షేర్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. వీడియోలోని వ్యక్తి తన ఒళ్లో నాలుగేళ్ల కూతురిని కూర్చోపెట్టుకుని కారు తోలడం చూసిన నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. దీంతో, వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ దృశ్యం చూడటానికి మురిపెంగా ఉన్నప్పటికీ పెను ప్రమాదం పొంచి ఉందని సదరు డాక్టర్ హెచ్చరించారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో కారు ముందుభాగాన్ని మరో వాహనం ఢీకొంటే తీవ్ర ప్రమాదం జరుగుతుంది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో పాటు చిన్నారి తల గంటకు 320 కిలోమీటర్ల వేగంతో తండ్రి ఛాతిభాగాన్ని ఢీకొనచ్చు. చివరకు ఇద్దరూ మరణిస్తారు. భారతీయ తల్లిదండ్రులకు ఈ విషయంలో అవగాహన ఉండాలి’’ అని ఆయన పోస్టు పెట్టారు. ఆ తండ్రికి తన కూతురిపై చాలా ఆపేక్ష ఉందనడంలో తనకు ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఇలాంటి పొరపాటున అతడు మరెన్నడూ చేయడని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. ఈ పనులతో కలిగే అనర్థాల గురించి తల్లిదండ్రులందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

ఘటనపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. ట్రాఫిక్ నిబంధనల విషయంలో భారతీయులకు అవగాహన తక్కువేనని పలువురు అన్నారు. లైసెన్స్ ఇచ్చేటప్పుడే యాక్సిడెంట్ ఘటనలు, ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడాలకు సంబంధించిన వీడియోలను వాహనదారులకు చూపిస్తే ఇలాంటి ప్రమాదాలు తప్పుతాయని కొందరు అభిప్రాయపడ్డారు. యాక్సిడెంట్ దాకా అవసరం లేదని, అకస్మాత్తుగా బ్రేక్ వేసినా చిన్నారికి బాగా దెబ్బలు తగులుతాయని వీడియోను చూసి మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి తప్పు ఏ తల్లిదండ్రులూ చేయకూడదని అన్నారు.

  • Loading...

More Telugu News