Punjab Kings: పంజాబ్ కింగ్స్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు!

Wasim Jaffer is set to take up the role succeeding Trevor Bayliss for Punjab Kings Coach says report

  • వసీం జాఫర్‌ను నియమించే అవకాశం ఉందంటూ మీడియాలో కథనాలు
  • గతంలో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన జాఫర్
  • ప్రస్తుత కోచ్ ట్రెవర్ బేలిస్ పదవీకాలం ముగిసిపోవడంతో కొత్త వ్యక్తిని నియమించే యోచనలో యాజమాన్యం

ఐపీఎల్ టైటిల్‌ను ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవని నాలుగు ఫ్రాంచైజీలలో పంజాబ్స్ కింగ్స్ జట్టు ఒకటి. టైటిల్ కోసం ఆ జట్టు ఎన్ని మార్పులు, ప్రయోగాలు చేస్తున్నా ఫలితాన్ని ఇవ్వడం లేదు. కాగా ఆ జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ రెండేళ్ల పదవీకాలం ఐపీఎల్ 2024తో ముగిసిపోయింది. దీంతో ఈ స్థానంలో మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ను ఆ జట్టు యాజమాన్యం నియమించనుందని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. 2019-2021 మధ్య కూడా పంజాబ్ కింగ్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. అయితే ఐపీఎల్ 2022 వేలానికి ముందు అతడు వైదొలగాడు. భారత జట్టు తరపున 31 టెస్టులు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడిన వసీం జాఫర్ వయసు 46 సంవత్సరాలు. కోచ్‌గా జాఫర్‌ను నియమిస్తే టైటిల్ వేటలో ఆ జట్టు మరో ప్రయత్నం చేసినట్టు అవుతుంది. ఇక గత రెండు సీజన్లలో జట్టుకు మార్గనిర్దేశనం చేసిన కోచ్ బేలిస్ పదవీకాలం ముగిసిపోయింది. ఈ రెండేళ్లూ జట్టు స్థిరంగా రాణించలేకపోయింది.

ఇదిలావుంచితే.. పంజాబ్ కింగ్స్ జట్టు 2014 తర్వాత  కనీసం ఒక్కసారి కూడా ఫ్లే ఆఫ్స్ చేరుకోలేకపోయింది. ఐపీఎల్ 2024లోనూ పేలవమైన ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. అయితే టీ20 క్రికెట్‌లోనే అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ సాధించింది. చేతిలో మరో 5 వికెట్లు మిగిలివుండగానే సాధించడం గమనార్హం. 

  • Loading...

More Telugu News