Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రతిపాదనల సవరింపు.. కోకాపేట వరకూ మెట్రో నిర్మాణం

Hyderabad Metro second phase to be expanded says minister Bhatti

  • బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి ప్రకటన
  • 70 కిలోమీటర్ల నుంచి 78.4 కిలోమీటర్లకు పెరగనున్న మెట్రో మార్గం
  • రూ.24,042 కోట్లకు చేరిన అంచనా వ్యయం

హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. పాత వాటి స్థానంలో కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మునుపటి ప్రతిపాదనల్లో భాగంగా 5 కారిడార్లలో 70 కిలోమీటర్ల మేర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. తాజా సవరింపుతో అది 78.4 కిలోమీటర్లకు చేరుకుంది. అంచనా వ్యయం కూడా పెరిగి రూ.24,042 కోట్లకు చేరింది. 

ఈ మార్గాల్లోనే కొత్త ట్రాక్ నిర్మాణం.. 
మునుపటి ప్రతిపాదనల ప్రకారం, రాయదుర్గం నుంచి విప్రో కూడలి, యూఎస్ కాన్సులేట్ వరకూ 8 కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టాలి. దీన్ని కోకాపేటలోని నియోపోలిస్ వరకూ విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా 3.3 కిలోమీటర్ల మేర అదనంగా నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఇక అక్కడే మెట్రో డిపో ఏర్పాటు కోసం అధికారులు భూముల పరిశీలన చేశారు. 

నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి కూడలి నుంచి జల్‌పల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకూ మొదట్లో 29 కిలోమీటర్ల మేర ఎయిర్‌‌పోర్టు మెట్రోను ప్లాన్ చేశారు. తాజా సవరింపుతో ఇది 4 కిలోమీటర్ల మేర పెరిగింది. ఈ కారిడార్‌లో మైలార్ దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్, కొత్త హైకోర్టు వరకూ 5 కిలోమీటర్లకు పైగా మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. ఇక ఎల్బీనగర్ - హయత్‌నగర్, మియాపూర్-పటాన్‌చెరు, ఫలక్‌నుమా-చాంద్రాయణగుట్ట కారిడార్లలో మాత్రం మార్పులు చేర్పులు చేయలేదు. 

అయితే, నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్టలను మెట్రో ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తామని మంత్రి భట్టి అసెంబ్లీలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News