Seethakka: కేంద్ర బడ్జెట్‌పై స్పందించని కేసీఆర్... రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడటం విడ్డూరం: మంత్రి సీతక్క

Seethakka questions kcr over budget issue

  • కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్న సీతక్క
  • కేంద్ర బడ్జెట్‌పై తీర్మానం చేస్తే కేసీఆర్ రాలేదని మండిపాటు
  • బీజేపీ మెప్పు కోసం రాష్ట్ర బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారన్న మంత్రి

కేంద్రబడ్జెట్‌పై స్పందించని కేసీఆర్... రాష్ట్ర బడ్జెట్‌పై మాత్రం మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలపై సీతక్క స్పందిస్తూ... కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దీనిని నిరసిస్తూ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మెప్పు కోసం రాష్ట్ర బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు.

కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆగ్రహం


ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ మీడియా పాయింట్‌కు వచ్చారని... త్వరలోనే ఆయన బోను ఎక్కేస్తారని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఊహల్లో బతికిన కేసీఆర్.. ఇంకా తానే రాజును అని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో... బీఆర్ఎస్ ఉన్న పదేళ్లలో వాటికి నిధులే ఇవ్వలేదని విమర్శించారు. 

బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని అందుకే ప్రతిపక్షానికి మింగుడు పడటం లేదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గంగలో కలిపిందన్నారు.

అన్ని శాఖలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చామని మరో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఒక్కో రంగానికి ఇచ్చే నిధులను విపులంగా వివరించినట్లు చెప్పారు. గతంలో బడ్జెట్ పేపర్లకు పరిమితమయ్యేదన్నారు. కేసీఆర్ ఇంకా ఊహల్లో ఉండకుండా బడ్జెట్‌ను ఆహ్వానించాలన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసంక్షేమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. పదేళ్ల పాటు నీటిపారుదల ప్రాజెక్టులు అంటూ డబ్బులు తగలేశారని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అన్ని రంగాలకు, సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు.

  • Loading...

More Telugu News