Komatireddy Raj Gopal Reddy: నేను హోంమంత్రిని కావాలని కోరుకుంటున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి సరదా సంభాషణ

Komatireddy Rajagopal Reddy interesting comments

  • బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే తాను హోంమంత్రిని అయ్యేవాడినన్న మల్లారెడ్డి
  • నేను మంత్రి పదవి కోసం పైరవీలు చేయనని సమాధానం చెప్పిన రాజగోపాల్ రెడ్డి
  • కేసీఆర్‌ను సభకు రమ్మని చెప్పండని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచన

నేను హోంమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు... అధిష్ఠానం మాట ఇచ్చింది... ఎప్పుడనేది నిర్ణయిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం సమావేశాల అనంతరం అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ... మా పార్టీ అధికారంలోకి వచ్చి ఉండే నేను హోంమంత్రిని అయ్యేవాడిని, రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు అవుతారో? అన్నారు. దానికి కోమటిరెడ్డి స్పందిస్తూ... తాను మంత్రి పదవి కోసం పైరవీలు చేయనని సమాధానం ఇచ్చారు.

'మాతో బాగా ఉంటే రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి పదవి వస్తుంది. నాతో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. అవకాశం వస్తే పదిమందిని తీసుకువస్తాన'ని ప్రశాంత్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. దానికి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ... మావాళ్లు ఎందుకొస్తారన్నా... మీవాళ్లే మాతో కలుస్తున్నారన్నారు. మూడింట రెండొంతుల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము చేర్చుకుంటామన్నారు.

కేసీఆర్‌ను సభకు రమ్మని చెప్పండని, సభానాయకుడిగా ఉంటేనే వస్తానని అంటే ఎలా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మా స్థాయి సరిపోతుందని కేటీఆర్ చెబుతున్నారని, అలాంటప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని నిలదీశారు. ప్రతిపక్ష హోదాను కేటీఆర్ తీసుకోవాలన్నారు.

కేసీఆర్‌ను దేవుడిలా పెట్టి పూజారులుగా తామే నడిపిస్తామని గంగుల కమలాకర్ అన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ రూ.300 కోట్లు ఖర్చు పెట్టారని, ఆ ఉప ఎన్నిక ప్రభావంపై కేసీఆర్ పడిందని, అందుకే అధికారం కోల్పోయారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

గతంలో బీజేపీలోకి వెళ్లినప్పుడు మీరు రాజీనామా చేశారని, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయాలని అడగాలని రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి బాల్క సుమన్ అన్నారు. మీరు మంత్రి పదవికి అర్హులు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే అవుతుందని రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

  • Loading...

More Telugu News