Ex Agniveers: సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్‌ లో మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్: కేంద్ర హోంశాఖ

Home Ministry said that Ex Agniveers to receive 10 per cent reservation in CISF and BSF and SSB

  • వయో సడలింపు కూడా లభిస్తుందని హోం మంత్రిత్వ శాఖ ప్రకటన
  • ఎస్‌ఎస్‌బీ, ఆర్‌పీఎఫ్‌లలో కూడా రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రకటన
  • మోదీ దార్శనికత, అమిత్ షా మార్గనిర్దేశనంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడి

మాజీ అగ్నివీరులకు సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీలలో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మాజీ అగ్నివీరులను వివిధ ర్యాంకులలో భర్తీ చేసుకోనున్నామని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ బుధవారం ప్రకటించారు. వారికి వయో సడలింపు కూడా ఉంటుందని వెల్లడించారు. నాలుగేళ్ల అనుభవం, శిక్షణ పొందిన అగ్ని వీరులు భద్రతా బలగాలకు ఆదర్శవంతమైన అభ్యర్థులు అవుతారని హోం మంత్రిత్వ శాఖ గుర్తించిన నేపథ్యంలో బీఎస్ఎఫ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత, హోంమంత్రి అమిత్ షా మార్గనిర్దేశనంలో అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించామని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బీఎస్ఎఫ్‌ను మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా నిర్దేశించుకున్నారని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది.

ఇక మాజీ అగ్నివీరులను చేర్చుకునేందుకు సీఐఎస్‌ఎఫ్‌ కూడా సిద్ధంగా ఉందంటూ కేంద్ర హోంశాఖ మరో ట్వీట్‌లో వెల్లడించింది. మాజీ అగ్నీ వీరులకు వయసు, శారీరక సామర్థ్య పరీక్షలో సడలింపులు ఉంటాయని, కానిస్టేబుల్ పోస్టులకు 10 శాతం రిజర్వేషన్‌ పొందుతారని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. 

మరోవైపు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కూడా మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, అగ్నివీరులకు వయస్సు, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌లలో సడలింపులు పెంచుతున్నట్టు హోం శాఖ ప్రకటనలో పేర్కొంది. భద్రతా బలగాల బలోపేతానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని డైరెక్టర్ జనరల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక సశస్త్ర సీమాబల్‌లో (ఎస్ఎస్‌బీ) కూడా అగ్నివీరులకు కోటా లభించనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కాగా సాయుధ బలగాల్లో నియామకం కోసం జూన్ 2022లో కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌’ను ప్రకటించింది. 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువకులను మాత్రమే ఎంపిక చేస్తారు. నాలుగేళ్ల సేవకు ఉద్దేశించి వీరిని ఎంపిక చేస్తారు. అయితే వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత కూడా ఈ వ్యవస్థలో కొనసాగనిస్తారు. మిగతా 75 శాతం మందిని ప్యాకేజీతో పదవీ విరమణ చేయిస్తారు. అయితే నాలుగేళ్ల పదవీకాలం తర్వాత ఈ 75 శాతం మంది అగ్నివీరుల భవిష్యత్ ఏంటని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News