Union Budget: బడ్జెట్ ప్రకటన అనంతరం ధర పెరగనున్న, తగ్గనున్న వస్తువులు ఇవే!

major reduction in customs duty on cancer medicines and mobile phones Makes mobile phones cheaper

  • మూడు క్యాన్సర్ ఔషధాలను కస్టమ్స్ ట్యాక్స్ నుంచి మినహాయించిన కేంద్రం
  • తగ్గనున్న క్యాన్సర్ మందుల ధరలు
  • కస్టమ్స్ సుంకం తగ్గింపుతో తగ్గనున్న బంగారం, మొబైల్ ఫోన్ల రేట్లు
  • పెరగనున్న ప్లాస్టిక్ వస్తువుల ధరలు

కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రకటనతో కొన్ని వస్తువుల ధరలు పెరగనుండగా మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్ పేషెంట్లకు ఉపశమనం కల్పిస్తూ బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం మరో 3 క్యాన్సర్ చికిత్స ఔషధాలను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయిస్తోందని వెల్లడించారు. దీంతో క్యాన్సర్ ఔషధాల ధరలు తగ్గనున్నాయి.

మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఛార్జర్లు, ఇతర మొబైల్ విడిభాగాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో వాటి ధరలు కూడా తగ్గనున్నాయి. ఇక తోలుతో తయారు చేసిన వస్తువులు, సముద్రపు ఆహారాల (సీ ఫుడ్) ధరలు కూడా చౌకగా మారనున్నాయి. 

దేశీయంగా భారీ డిమాండ్ ఉన్న బంగారం, వెండి దిగుమతులపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్టు సీతారామన్ పేర్కొన్నారు. 10 నుంచి 6 శాతానికి సుంకం తగ్గించడంతో విలువైన ఈ రెండు మెటల్స్ ధరలు తగ్గనున్నాయి. దిగుమతి సుంకం తగ్గించడంతో దేశీయంగా బంగారానికి మరింత డిమాండ్ ఏర్పడనుందనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ నిరోధానికి కూడా ఈ ప్రకటన ఉపయోగపడుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇక ప్లాటినమ్ దిగుమతులపై సుంకాన్ని 6.4 శాతానికి తగ్గిస్తున్నట్టు బడ్జెట్‌లో కేంద్రం పేర్కొంది. దీంతో వీటి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.

ధరలు పెరగనున్న వస్తువులు ఇవే..

పర్యావరణ హితం కోరుతూ కొన్ని ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతులపై ప్రభుత్వం సుంకాలను పెంచింది. అమ్మోనియం నైట్రేట్‌పై 10 శాతం, బయోడిగ్రేడబుల్‌ సాధ్యంకాని ప్లాస్టిక్‌పై 25 శాతం కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. దీంతో ప్లాస్టిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. టెలికం పరికరాల ధరలు కూడా పెరగనున్నాయి.

  • Loading...

More Telugu News