Budget 2024: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట
- అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు
- అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్న మంత్రి
- రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పీట వేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందని పేర్కొంటూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు ప్రకటించారు. అంతేకాదు, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈమేరకు లోక్ సభలో మంత్రి నిర్మల మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లను ప్రత్యేక సాయంగా అందిస్తామని చెప్పారు.
దీంతో పాటు అమరావతి అభివృద్ధికి అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయడానికి ఏపీ ప్రభుత్వానికి సహాయసహకారాలు అందిస్తామని అన్నారు. ఇక, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. విశాఖ- చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్- బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు కేటాయించామని వివరించారు.