Earths Water Depleting: వేగంగా క్షీణిస్తున్న నీటి వనరుల్లోని ఆక్సిజన్!.. ఈ పరిణామం దేనికి దారితీస్తుంది?

A new study has said that oxygen dissolved in worlds water bodies is dwindling rapidly

  • భూమిపై నీరు వేగంగా తరిగిపోతోందన్న అమెరికా శాస్త్రవేత్తల నూతన అధ్యయనం
  • భూగ్రహంపై ప్రాణ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా హెచ్చరించిన శాస్త్రవేత్తలు
  • వాతావరణ మార్పులే కారణమని వార్నింగ్

ప్రపంచ నీటి వనరుల్లో కరిగి ఉండే ఆక్సిజన్ వేగంగా క్షీణిస్తోందని నూతన అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిణామం భూగ్రహంపై ప్రాణ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుల్లో ఒకటిగా పరిణమించే అవకాశం ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తల బృందం హెచ్చరించినట్టు ‘సైన్స్ అలర్ట్’ కథనం పేర్కొంది. వాతావరణ మార్పులు, కర్బన వాయు ఉద్గారాల కారణంగానే ఇలా జరుగుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వేడి నీటిలో తక్కువ ఆక్సిజన్‌ ఉంటుందని, నీటిలో ఉండే ఆక్సిజన్‌పై ఆధారపడి జీవించే ప్రాణులకు ఇది పెనుప్రమాదమని అధ్యయనం విశ్లేషించింది. అంతేకాదు మనుషులు, జంతువులకు చాలా ముఖ్యమైన వాతావరణంలోని ఆక్సిజన్‌పై కూడా ప్రభావం పడుతుందని పేర్కొంది.

నీటి వనరుల్లోని ఆక్సిజన్ వేగంగా తగ్గడానికి ఆల్కే, బాక్టీరియా కూడా కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. 
వ్యవసాయ, వినియోగం కోసం వాడే ఫెర్టిలైజర్లు, మురుగు, పారిశ్రామిక వ్యర్థాల రూపంలో సేంద్రియ పదార్థాలు నీటిలో కలుస్తుండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ప్రాణవాయువు ప్రమాదకర స్థాయికి పడిపోతే ఆక్సిజన్‌పై ఆధారపడని సూక్ష్మజీవులు కూడా చనిపోతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

గ్రహ సరిహద్దుల జాబితాలో చేర్చాలి..
మనుషుల పురోగతి, సురక్షిత కార్యకలాపాల కోసం భూమి చుట్టూ నిర్దేశించుకున్న ‘గ్రహ సరిహద్దుల’ (Planetary Boundaries) జాబితాలో ఈ ‘ఆక్వాటిక్ డీఆక్సిజనేషన్’ను కూడా జత చేయాలని పరిశోధనా బృందం అభిప్రాయపడింది. ఇప్పటివరకు వాతావరణ మార్పు, సముద్రాల ఆమ్లీకరణ, ఓజోన్ క్షీణత, ప్రపంచ భాస్వరం-నత్రజని వలయాలు, జీవవైవిధ్య తగ్గుదల రేటు, ప్రపంచ తాజా మంచినీటి వినియోగం, భూమి-వ్యవస్థలో మార్పు, ఏరోసోల్ లోడింగ్, రసాయన కాలుష్యం పేరిట మొత్తం తొమ్మిది గ్రహ సరిహద్దులు ఉన్నాయి. 

భూమిపై తాజా నీరు, సముద్ర జలాల్లోని ఆక్సిజన్ క్షీణతను అదనపు భూగ్రహ సరిహద్దుగా పరిగణించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమిపై జీవ పర్యావరణం, సామాజిక వ్యవస్థల సమగ్రతకు ఈ అదనపు గ్రహ సరిహద్దు ప్రక్రియ ముఖ్యమని వారు పేర్కొన్నారు. ఇతర గ్రహ సరిహద్దు ప్రక్రియలతో పోల్చదగిన విధంగా ఆక్సిజన్ క్షీణత చేరుకుంటోందని వారు వివరించారు.

  • Loading...

More Telugu News