Obecity: ఏపీలో పెరిగిపోతున్న ఊబకాయుల సంఖ్య... ఆర్థిక సర్వేలో వెల్లడి

Obecity problem raises in AP as per economic survey

  • నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
  • జాతీయ ఆర్థిక సర్వే వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్
  • దేశంలో స్థూలకాయం సమస్య అధికమవుతోందని నివేదికలో వెల్లడి
  • టాప్-3లో ఏపీ

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ ఆర్థిక సర్వే వివరాలను సభ ముందుకు తీసుకువచ్చారు. ఇందులో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్) నివేదిక వివరాలను కూడా పొందుపరిచారు. అందులో ఊబకాయం అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. 

దేశంలో స్థూలకాయం సమస్య అధికమవుతోందని ఈ నివేదిక చెబుతోంది. 54 శాతం అనారోగ్య సమస్యలకు మూల కారణం అధిక బరువుతో బాధపడుతుండడమేనని స్పష్టం చేసింది. 

అదే సమయంలో, కొన్ని రాష్ట్రాల్లో ఊబకాయం సమస్య ఆందోళనకర స్థాయిలో ఉందని వివరించింది. ఢిల్లీ, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో ఒబేసిటీ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది. ఢిల్లీలో 41.3 శాతం మంది మహిళలు, 38 శాతం మంది పురుషులు... తమిళనాడులో 37 శాతం మంది పురుషులు, 40.4 శాతం మంది మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నట్తు వెల్లడించింది. 

ఈ జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఏపీలో 31.1 శాతం మంది పురుషులు, 36.3 శాతం మంది మహిళలను ఊబకాయం సమస్య వేధిస్తోందని సర్వేలో వివరించారు. 

ఇక, ఓవరాల్ గా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో కంటే నగరాల్లోనే ఊబకాయంతో బాధపడే వారు ఎక్కువగా ఉన్నారట. గ్రామీణ ప్రాంతాల్లో అధిక బరువుతో బాధపడేవారు 19.3 శాతం ఉండగా... నగరాలు, పట్టణాల్లో 29.8 శాతం మంది ఊబకాయులేనని నివేదికలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News