Andhra Pradesh: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Session Started Governor Speech

  • ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
  • అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. నల్ల కండువాలతో హాజరు
  • సేవ్ డెమోక్రసీ అంటూ సభలో నినాదాలు.. వాకౌట్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్లకండువాలతో సభకు హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్యే గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

రాష్ట్ర విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని చెప్పారు. రెవెన్యూ లోటును, ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. 2014 లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఏపీ అభివృద్దికి కృషి చేశారని, వైసీపీ పాలనలో రాష్ట్రం వెనకబడిందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలను ఆయన అభినందించారు. కాగా, గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

  • Loading...

More Telugu News