Joe Biden: అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ వైదొలగడంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్

Donald trump said that Joe Biden was not fit to run for President

  • మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడే అర్హత బైడెన్‌కు లేదని వ్యాఖ్య
  • దేశానికి సేవ చేసేందుకు ఫిట్ కాడని విమర్శ
  • ఎన్నికల రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు -2024 రేసు నుంచి వైదొలగుతున్నట్టు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష పదవికి పోటీ పడే అర్హత బైడెన్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా దేశానికి సేవలు అందించడానికి ఆయన ఫిట్ కాడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ‘ట్రూత్ సోషల్’ వేదిక ద్వారా ఆయన స్పందించారు. 

‘‘బైడెన్ అధ్యక్ష పదవి కారణంగా మనం చాలా నష్టపోతాం. అయితే బైడెన్ కలిగించిన నష్టాన్ని మేము త్వరగా పూడ్చుతాము’’ అని అన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మరో అగ్రనేత, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ పనికిరారని, అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటే.. మరి అధ్యక్షుడిగా కొనసాగడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.

బైడెన్ తప్పుకున్న నేపథ్యంలో కమలా హ్యారీస్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖరారైంది. దీంతో ట్రంప్ సారధ్యంలోని రిపబ్లికన్ పార్టీ ఇకపై ఎలాంటి ప్రచార వ్యూహాన్ని అనుసరించనుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇప్పటికే చర్చలు, విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి. కాగా కమలా హ్యారీస్‌ను ఎదుర్కొనే విషయంలో తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని రిపబ్లికన్ నేతలు చెబుతున్నారు. బైడెన్ హయాంలో ఇమ్మిగ్రేషన్, ద్రవ్యోల్బణంతో పాటు అనేక సమస్యలు తలెత్తాయని, హారిస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఇవే తమ అస్త్రాలు అని చెబుతున్నారు.

కాగా అధికార డెమొక్రాటిక్ పార్టీలో అంతర్గత ఒత్తిడి తీవ్రమవుతున్న వేళ అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారీస్‌ ఎన్నికల్లో పోటీ పడేందుకు మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేశారు. పార్టీ సీనియర్ సభ్యులను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News