Donald Trump: ప్రజాస్వామ్యం కోసం తూటాకు ఎదురు నిలిచా: డొనాల్డ్ ట్రంప్

Trump says he took a bullet for democracy at 1st rally after assassination bid

  • హత్యాయత్నం ఘటన తరువాత మిషిగన్‌లో ట్రంప్ తొలి ర్యాలీ
  • దేవుడి దయవల్లే మీ ముందున్నానంటూ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యః
  • తాను అధ్యక్షుడినయ్యాక రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని భరోసా
  • బైడెన్ బలహీనుడు, వృద్ధుడంటూ విమర్శలు

ప్రజాస్వామ్యానికి తాను ప్రమాదకరమని విమర్శిస్తుంటారని, కానీ తానే ప్రజాస్వామ్యం కోసం తూటాకు ఎదురు నిలిచానని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. హత్యాయత్నం ఘటన తరువాత ట్రంప్ తొలిసారిగా ర్యాలీలో పాల్గొన్నారు. మిషిగన్‌లో గ్రాండ్ రాపిడ్స్ ప్రాంతంలో జరిగిన ఈ ర్యాలీలో ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ కూడా పాల్గొన్నారు. ఇక ట్రంప్ ప్రసంగానికి అభిమానులు కరతాళధ్వనులతో పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. 

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తనపై హత్యాయత్నం జరిగి సరిగ్గా వారం రోజులు గడిచిందని అన్నారు. ఈ రోజు తాను ప్రాణాలతో ఉన్నానంటే దానికి దేవుడే కారణమని అన్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకూడదని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇక తన రాజకీయ ప్రత్యర్థులైన డెమోక్రాట్లపై ట్రంప్ విరుచుకుపడ్డారు. బైడెన్ బలహీనుడని, వృద్ధుడని ఎద్దేవా చేశారు. డెమోక్రటిక్ పార్టీ నాయకత్వ లేమితో సతమతమవుతోందని అన్నారు. వారి నాయకుడెవరో వారికే కాక తమకూ తెలీదని అన్నారు. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలంటూ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఒత్తిడి తెస్తోందని అన్నారు. 

తాను అధ్యక్షుడినయ్యాక ఉక్రెయిన్ - రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. వారు దృఢచిత్తులని, వారి ముందు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తేలిపోతారని వ్యాఖ్యానించారు. జీ చైనా ప్రజలను ఉక్కు పిడికిలితో పరిపాలిస్తున్నారని అన్నారు. తాను అధ్యక్షుడినయ్యాక మూడో ప్రపంచ యుద్ధాన్ని తప్పిస్తానని కూడా చెప్పుకొచ్చారు.

More Telugu News