Dinosaur skeleton: రూ.373 కోట్లతో డైనోసార్ అస్థిపంజరాన్ని కొనుగోలు చేసిన బిలియనీర్

Citadel founder Ken Griffin has shattered auction records by splurging 44 million dollars for a dinosaur skeleton

  • వేలం రికార్డులు బద్దలు కొట్టిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ‘సిటాడెల్’ అధినేత కెన్ గ్రిఫిన్
  • 15 నిమిషాల వేలం పాటలో ఆరుగురితో పోటీపడ్డ సంపన్నుడు
  • చెక్కుచెదరని అతిపెద్ద డైనోసార్‌ అస్థిపంజరంగా గుర్తింపు

అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ‘సిటాడెల్’ వ్యవస్థాపకుడు, సీఈవో కెన్ గ్రిఫిన్ సుమారు రూ.373 కోట్లతో (44.6 మిలియన్ డాలర్లు) ఓ డైనోసార్ అస్థిపంజరాన్ని కొనుగోలు చేశారు. వేలం రికార్డులను బద్దలు కొడుతూ ఆయన ఈ డైనోసర్ అస్థిపంజరాన్ని దక్కించుకున్నారని ‘న్యూయార్క్ పోస్ట్’ కథనం పేర్కొంది. ‘సోథెబైస్’ అనే వేలం నిర్వహణ సంస్థ న్యూయార్క్‌లో బుధవారం నిర్వహించిన వేలంలో దీనిని దక్కించుకున్నారని తెలిపింది. కాగా ఆయన కొనుగోలు చేసిన డైనోసార్ అస్థిపంజరం అతి పెద్దదని, చెక్కుచెదరనిదని వివరించింది. వేలం చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన శిలాజ వస్తువు ఇదేనని తెలిపింది.

కాగా ఈ డైనోసార్ అస్థిపంజరం దాదాపు 150 మిలియన్ సంవత్సరాల పురాతనమైనదని అంచనా వేస్తున్నారు. ఈ భారీ అస్థిపంజరానికి ‘అపెక్స్’ అని పేరుపెట్టారు. కొలరాడోలోని డైనోసార్ అనే ప్రాంతానికి వెలుపల మే 2022లో తవ్వకాల చేపట్టిన పాలియోంటాలజిస్ట్ జాసన్ కూపర్ దీనిని గుర్తించారు. ఇప్పటివరకు కనుగొన్న డైనోసార్ అస్థిపంజరాల్లో ‘అపెక్స్’ అతి పెద్దదని వేలం నిర్వహణ సంస్థ ‘సోథెబైస్’ పేర్కొంది. దీని ఎత్తు 11 అడుగుల (3.3 మీటర్లు), 27 అడుగుల (8.2 మీటర్లు) పొడవు ఉందని తెలిపింది. మొత్తం 319 ఎముకలు ఉంటాయని అంచనా వేయగా అందులో 254 ఎముకలు చెక్కు చెదరకుండా ఉన్నాయని తెలిపింది.

కాగా ‘అపెక్స్’ను దక్కించుకునేందుకు ఏకంగా ఆరుగురు పోటీపడ్డారు. 15 నిమిషాల పాటు వేలంపాట జరిగింది. కెన్ గ్రిఫిన్ అందరినీ అధిగమించి ఈ అస్థిపంజరాన్ని దక్కించుకున్నారు. నిజానికి ఈ అస్థిపంజరం 6 మిలియన డాలర్ల వరకు అమ్ముడుపోతుందని అంచనా వేశారు. కానీ ఏకంగా 44.6 మిలియన డాలర్లు పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంచనా కంటే 11 రెట్లు అధిక ధర పలకడంతో రికార్డులు కూడా బద్దలయ్యాయి.

కాగా ఫోర్బ్స్ ప్రకారం కెన్ గ్రిఫిన్ సంపద సుమారు 37.8 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనాగా ఉంది. ఆయన రిపబ్లికన్ పార్టీకి రెగ్యులర్‌గా డొనేట్ చేస్తుంటారని పేర్కొంది.

  • Loading...

More Telugu News