Revanth Reddy: అమెరికాలో నిరసన తెలపచ్చు... ఏపీలో అక్రమ అరెస్ట్‌పై హైదరాబాద్‌లో మాత్రం తెలపకూడదా?: రేవంత్ రెడ్డి

Revanth Reddy about dharnas

  • పన్నులు కట్టే ప్రాంతంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందన్న సీఎం
  • నిరసనలు అణచివేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో డిసెంబర్ 3 ఫలితాలు వెల్లడించాయన్న సీఎం
  • చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలకు కేటీఆర్ అనుమతి ఇవ్వకపోవడంపై రేవంత్ రెడ్డి స్పందన

పన్నులు కట్టే ప్రాంతంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని, నిరసనలను అణచివేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో డిసెంబర్ 3, 2023 ఫలితాలను చూశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నోవా హోటల్‌లో జరుగుతున్న కమ్మ గ్లోబల్ సమ్మిట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన గత ఏడాది ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో హైదరాబాద్‌లో నిరసనలు వద్దని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కమ్మ గ్లోబల్ సమ్మిట్‌లో స్పందించారు.

అమెరికాలోని వైట్ హౌస్ వద్ద తెలంగాణ కోసం నిరసనలు తెలుపవచ్చునని... కానీ ఏపీలోని అక్రమ అరెస్ట్‌లపై మాత్రం హైదరాబాద్‌లో నిరసన తెలపనీయలేదని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిరసన ప్రాథమిక హక్కు... కానీ ఏపీలో అక్రమ అరెస్టులపై తెలంగాణలో నిరసనలు తెలపాలనుకుంటే అడ్డుకున్నారని... ఇదే వారి (బీఆర్ఎస్ ప్రభుత్వం) పతనానికి దారి తీసిందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన ఒక పద్ధతి అన్నారు.

నిరసన తెలియజేస్తే నిర్బంధిస్తామంటే దాని ఫలితాలు డిసెంబర్ 3న చూశారన్నారు. కమ్మ సంఘానికి గత ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చినట్లే ఇచ్చి లిటిగేషన్ పెట్టినట్లుగా తనకు తెలిసిందని, కానీ అవన్నీ పరిష్కరించి, అక్కడ భవనం కట్టుకోవడానికి కమ్మ సంఘానికి అనుమతి ఇస్తామన్నారు.

  • Loading...

More Telugu News