Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ చుట్టూ మరింతగా బిగుసుకుంటున్న ఉచ్చు

Trainee IAS officer Puja Khedkar Illegally Wrote Civils Exam For 12 Times

  • నిబంధనలకు విరుద్ధంగా 12 సార్లు సివిల్స్ రాసిన పూజ
  • అందుకోసం సమర్పించిన ధ్రువ పత్రాలన్నీ నకిలీవే
  • షోకాజ్ నోటీసు జారీ.. వివరణకు రెండు వారాల గడువు

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌ మెడచుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఆమె పలు అక్రమాలకు పాల్పడినట్టు ఇప్పటికే గుర్తించిన అధికారులు తాజాగా మరో బాగోతాన్ని వెలికి తీశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆమె ఏకంగా 12 సార్లు సివిల్స్ పరీక్షలకు హాజరైనట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్-2022 నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతోపాటు భవిష్యత్తులో మళ్లీ ఆమె పరీక్షలకు హాజరు కాకుండా చర్యలు చేపడుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ధ్రువపత్రాలు మార్చి 12సార్లు పరీక్షలు
జనరల్ కేటగిరీ అభ్యర్థులు 32 ఏళ్ల వరకు ఆరుసార్లు మాత్రమే సివిల్స్ రాసేందుకు అనుమతిస్తారు. ఓబీసీ అభ్యర్థులు 35 ఏళ్లు, ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులు 42 ఏళ్లు వచ్చే వరకు 9 సార్లు పరీక్షకు హాజరు కావొచ్చు. కానీ, పూజ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటో, సంతకం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ చిరునామా వంటివి మార్చడం ద్వారా ఏకంగా 12 సార్లు సివిల్స్ పరీక్ష రాశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

పూజ తల్లి ఇంజినీరింగ్ సంస్థ సీజ్
తనపై కేసు నమోదు కావడంతో పూజ ఖేద్కర్ నిన్న మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాను వదిలి వెళ్లిపోయారు. మళ్లీ వస్తానంటూ నాగ్‌పూర్ వెళ్లారు. మరోవైపు, పూజ తల్లికి సంబంధించిన ఇంజినీరింగ్ సంస్థను పింప్రి-చించ్‌వాడ నగరపాలక సంస్థ నిన్న సీజ్ చేసింది. దాదాపు రూ. 2 లక్షల ఆస్తి పన్ను బకాయి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, తుపాకితో రైతులను బెదిరించిన కేసులో పూజ తల్లి మనోరమ ప్రస్తుతం పూణే పోలీసుల అదుపులో ఉన్నారు.

  • Loading...

More Telugu News