Steve Jobs: వాళ్లవి నాసిరకం ఉత్పత్తులు.. మైక్రోసాఫ్ట్‌పై స్టీవ్ జాబ్స్ విమర్శల వైరల్

Video of steve jobs criticizing microsoft goes viral

  • విండోస్ ఓఎస్ క్రాష్‌తో ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలపై ప్రభావం
  • మైక్రోసాఫ్ట్‌పై విమర్శల వెల్లువ, 1995 నాటి స్టీవ్ జాబ్స్ ఇంటర్వ్యూ వైరల్
  • మైక్రోసాఫ్ట్ వారికి సరైన అభిరుచి లేదని అప్పట్లో స్టీవ్ జాబ్స్ ఘాటు వ్యాఖ్య

నిన్నటి విండోస్ క్రాష్ ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపించింది. ఆర్థిక రంగం నుంచి వైమానిక రంగం వరకూ కంప్యూటర్లు మొరాయించడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో, మైక్రోసాఫ్ట్‌ సేవాలోపంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 1995లో మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులపై గుప్పించిన ఘాటు విమర్శలు వైరల్‌గా మారాయి. మైక్రోసాఫ్ట్ థర్డ్ రేట్ (నాసిరకం) ఉత్పత్తులను తయారు చేస్తుందని స్టీవ్ జాబ్స్ మండిపడ్డారు. 

‘‘మైక్రోసాఫ్ట్‌తో ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే వాళ్లకు మంచి అభిరుచి లేనేలేదు. నేను ఇదేమీ ఆషామాషీగా చెప్పడం లేదు. వాళ్లకు కొత్త ఆలోచనలు లేవు. వాళ్లు తమ ఉత్పత్తులకు కొత్త సంస్కృతిని జోడించలేరు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఉదాహరణకు ఇంగ్లీష్‌లో అందమైన ఫాంట్స్‌కు, టైప్ సెట్టింగ్స్, పుస్తకాలే స్ఫూర్తి. అసుల మాక్ అనేదే లేకపోతే మైక్రోసాఫ్ట్ వాటిల్లో ఈ ఫాంట్స్ ఉండేవే కావు. కాబట్టి, నాకు మైక్రోసాఫ్ట్‌ను చూస్తే విచారం కలుగుతుంది. మైక్రోసాఫ్ట్ విజయాలపై నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. వాళ్లు ఆ విజయాలకు అర్హులే. కానీ వాళ్లు అన్నీ థర్డ్ రేట్ ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇది నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది’’ అంటూ స్టీవ్ జాబ్స్ విమర్శించాడు. 

కాగా, మైక్రోసాఫ్ట్ నిన్ననే సమస్యను పరిష్కరించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. విండోస్ సిస్టమ్ షట్ డౌన్ అవుతూ బ్లూ స్క్రీన్ కనిపించడానికి కారణం ఓ సెక్యూరిటీ అప్‌డేట్ అని వివరించింది. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు భద్రత అందించే క్రౌడ్ స్ట్రైక్ సంస్థ పంపించిన సెక్యూరిటీ అప్‌డేట్ ఈ క్రాష్‌కు కారణమైందని వివరించింది. ఇక ఈ క్రాష్ కారణంగా భారత్‌లో విమానసేవలు, చెల్లింపుల వ్యవస్థలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వంటివన్నీ ప్రభావితమయ్యాయి. ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్, స్పైస్ జెట్ వంటి సంస్థలు.. ప్రయాణికులకు చేతిరాతతో ఉన్న బోర్డింగ్ పాస్‌లను జారీ చేశాయి.

  • Loading...

More Telugu News