Bangladesh Protests: బంగ్లాదేశ్ అల్లర్లలో 105 మంది మృతి.. దేశవ్యాప్త కర్ఫ్యూ విధింపు

Bangladesh Imposes Nationwide Curfew

  • రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళన
  • దేశ వ్యాప్తంగా నిరసనలు
  • ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్
  • జైలులోని ఖైదీలను విడిపించి, జైలుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
  • పోలీసు వ్యవస్థ విఫలం కావడంతో రంగంలోకి మిలటరీ

విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. విద్యార్థుల ఆందోళనలను అదుపు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో మిలటరీని రంగంలోకి దించింది. కాగా, ఆందోళనల్లో ఇప్పటి వరకు 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రాజధానిలోనే 52 మంది మృతి చెందారు. ఎక్కువ మరణాలకు పోలీసుల కాల్పులే కారణమని తెలుస్తోంది.    

ఇంటర్నెట్ నిలిపివేత
రాజధాని ఢాకాలో ర్యాలీలు, ప్రదర్శనలు, ప్రజలు గుమికూడడాన్ని నిషేధించారు. ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు. ఈ మరణాలకు ప్రధాని షేక్ హసీనానే కారణమని, ఆమె వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

జైలుకు నిప్పు
నర్సింగ్డి జిల్లాలో ఆందోళనకారులు జైలులోకి దూసుకెళ్లి ఖైదీలను విడుదల చేశారు. అనంతరం జైలుకు నిప్పు పెట్టారు. జైలు నుంచి వందలాదిమంది ఖైదీలు పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థి ఆందోళనకారులపై దాడులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆవేదన వ్యక్తం చేశారు. 
    
ఎందుకీ ఆందోళనలు
స్వతంత్ర దేశం కోసం పాకిస్థాన్‌తో 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో పాల్గొన్న వారి పిల్లలు సహా కొన్ని నిర్దిష్ఠ సమూహాలకు సగానికిపైగా సివిల్ సర్వీస్ పోస్టుల్లో రిజర్వ్ చేసిన కోటా వ్యవస్థకు ముగింపు పలకాలంటూ ఈ నెలలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రధాని హసీనాకు మద్దతునిచ్చే ప్రభుత్వ అనుకూల గ్రూపుల పిల్లలే ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారన్న విమర్శలున్నాయి.

  • Loading...

More Telugu News