Dibrugarh Express: పట్టాలు తప్పిన దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్.. ముగ్గురి మృతి

Dibrugarh Express derails in Gonda Three dead

  • ఉత్తర ప్రదేశ్‌లోని గోండా సమీపంలో ఘటన
  • రైలు పట్టాలు తప్పడానికి ముందు పేలుడు వినిపించిందన్న ప్రత్యక్ష సాక్షి
  • మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన రైల్వే
  • కవచ్ వ్యవస్థ ఏమైందని ప్రధాని, రైల్వే మంత్రిని ప్రశ్నించిన మల్లికార్జున ఖర్గే

చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 30 మంది వరకు గాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లోని గోండా సమీపంలో మోతీగంజ్-ఝిలాహీ రైల్వే స్టేషన్ల మధ్య నిన్న జరిగిందీ ఘటన. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రైలు పట్టాలు తప్పడానికి ముందు పేలుడు వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ వెంటనే రైల్లో చీకటి అలముకుని, గందరగోళం తలెత్తినట్టు చెప్పారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎంపీ కృతి వర్ధన్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనపై రైల్వే అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ప్రకటించింది.

ఇటీవలి కాలంలో తరచూ రైలు ప్రమాదాలు జరుగుతుండడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. రైల్వేలో భద్రత లోపించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు యాంటీ కొలీషన్ వ్యవస్థ కవచ్‌ను రైళ్లలో ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ప్రశ్నించారు. వీరికి పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధ రైల్వే భద్రతపై లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News