Mallu Bhatti Vikramarka: ఈ నిధులను రుణమాఫీకే వినియోగించాలి.. ఇతర అప్పులకు జమ చేయవద్దు: భట్టివిక్రమార్క

Bhattivikramarka says funds only for loan waiver
  • ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకర్లకు సూచన
  • రూ.2 లక్షలకు పైగా రుణం ఉంటే ఆపై మొత్తాన్ని రికవరీ చేసుకోవాలని సూచన
  • ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేశామన్న ఉపముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రుణమాఫీకే వినియోగించాలని, ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయవద్దని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి ఆయన బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతు రుణమాఫీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా ఒకేసారి రూ.31 వేల కోట్లు ఏ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదన్నారు.

ఆగస్ట్ నెల రాకముందే రుణమాఫీ కింద రూ.31 వేల కోట్లను విడుదల చేస్తామన్నారు. ఈరోజు 11 లక్షలకు పైగా రైతులకు రూ.6 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెలలోనె రెండో దఫా రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి మిగతా సొమ్మును రికవరీ చేసుకోవాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.2 లక్షలతో కలిపి మొత్తంగా ఏ రైతూ బ్యాంకులకు అప్పు ఉండకూడదన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, తాను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డుపై సంతకం చేసి ప్రచారంలోకి వెళ్లామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తు.చ తప్పకుండా రైతు రుణమాఫీని అమలు చేసి చూపిస్తున్నామన్నారు. దేశ బ్యాంకింగ్ రంగంలో ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అన్నారు. కార్పోరేట్ బ్యాంకింగ్ చరిత్రలోనూ ఇంతలా ఒకేసారి జరగలేదన్నారు.
Mallu Bhatti Vikramarka
Congress
Telangana

More Telugu News