Chandrababu: మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీలో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన ఐదేళ్లలో శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు.. తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి, వివేకా హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం.