Joe Biden: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కరోనా!

Biden Tests Positive For Covid As Age Worries Mount

  • అధ్యక్షుడు కరోనా బారిన పడ్డట్టు బుధవారం ప్రకటించిన శ్వేతసౌధం
  • జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్టు వెల్లడి
  • శ్వాస రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయులు సాధారణం
  • తీవ్ర అనారోగ్యం తలెత్తితే ఎన్నికల నుంచి తప్పుకుంటానని అంతకుముందే ప్రకటించిన బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకోవడం దాదాపు ఖరారైనట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా టెస్టుల్లో ఆయనకు కొవిడ్ ఉన్నట్టు బయటపడటమే ఇందుకు కారణం. బుధవారం ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఏదైనా పెద్ద అనారోగ్యం చుట్టుముడితే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానంటూ అధ్యక్షుడు బైడెన్ అంతకుమునుపే ప్రకటించారు. లాస్ వెగాస్ లో పలు ఎన్నికల మీటింగుల్లో బైడెన్ పాల్గొనాల్సి ఉంది. తొలి సమావేశం సందర్భంగా ఆయన కొవిడ్ బారిన పడ్డట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో, సమావేశం వెంటనే ముగించుకుని ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కోసం డెలావేర్‌లోని తన బీచ్ హౌస్‌కు వెళ్లారు. అయితే, తాను బాగానే ఉన్నానంటూ కారు లోంచే ఆయన థమ్స్ అప్ సైగ చేశారు. 

బైడెన్ కి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంపై శ్వేత సౌధం కీలక ప్రకటన చేసింది. అధ్యక్షుడు జలుబు, దగ్గు, ఇతర సాధారణ రోగ లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపింది. కొవిడ్‌కు సంబంధించి పాక్స్‌లోవిడ్ మందు వాడుతున్నారని, ఇప్పటికే తొలి డోసు తీసుకున్నారని వెల్లడించింది. శ్వాసరేటు, ఊపిరి తీసుకునే రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయులు అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. 

ఇటీవల ట్రంప్‌తో తొలి టీవీ చర్చ సందర్భంగా అధ్యక్షుడు తన ప్రసంగం గుర్తు చేసుకోలేక తడబడి, పొరబడి చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. ఇది చూసిన సొంత పార్టీ నేతలు కూడా బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు ప్రారంభించారు. తాను బాగానే ఉన్నానని, రేసులో కొనసాగుతానని బైడెన్ భరోసా ఇచ్చినా ఆందోళనలు చల్లారలేదు. తాజాగా కాలిఫోర్నియాకు చెందిన కీలక డెమోక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభ్యుడు ఆడమ్ షిఫ్ కూడా బైడెన్ తప్పుకోవాలని పిలుపునివ్వడంతో బైడెన్ రాజకీయ ప్రస్థానం ముగింపునకు వచ్చిందన్న కామెంట్స్ మరింతగా బలపడ్డాయి. మరోవైపు, హత్యాయత్నం నుంచి బయటపడ్డాక ట్రంప్ విజయావకాశాలు మరింత ఎక్కువయ్యాయని సర్వేలు పేర్కొంటున్నాయి. 

  • Loading...

More Telugu News