Arvind Kejriwal: ఈడీ కేసులో ఎక్కడ బయటకు వస్తానో అనే... సీబీఐ అరెస్ట్ చేసింది: కోర్టులో కేజ్రీవాల్

Arvind Kejriwal Plea Against CBI Arrest

  • కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించన అభిషేక్ మనుసింఘ్వీ
  • కేజ్రీవాల్‌కు అనుకూలంగా మూడుసార్లు కోర్టు తీర్పు వచ్చిందన్న న్యాయవాది
  • బెయిల్ వచ్చినా స్టే విధించేలా చేశారని కోర్టుకు తెలిపిన మనుసింఘ్వీ
  • జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని వెల్లడి

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐ వద్ద కారణాలు లేవని... కానీ ఈడీ కేసులో ఎక్కడ బయటకు వస్తారో అనే ఆలోచనతో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోందని ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ వాదనలు వినిపించారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై కోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా దర్యాఫ్తు సంస్థపై కేజ్రీవాల్ న్యాయవాది కీలకమైన ఆరోపణలు చేశారు.

ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాల్‌ను జైల్లోనే ఉంచాలనే ఉద్దేశంతో సీబీఐ ఆయనను అరెస్ట్ చేసిందన్నారు. మద్యం పాలసీకి సంబంధించి ఈడీ కేసులో మూడుసార్లు కోర్టు కేజ్రీవాల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఒకసారి సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ లభించిందన్నారు. ట్రయల్ కోర్టు సాధారణ బెయిల్ ఇచ్చిందని, కానీ దానిపై స్టే విధించేలా చేశారని వాదనల సందర్భంగా పేర్కొన్నారు.

ఆ తర్వాత సుప్రీంకోర్టులోను బెయిల్ లభించిందని, అయినా సీబీఐ కేసులో ఇంకా జైల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. 2022 ఆగస్ట్‌లోనే మద్యం విధానంపై ఆరోపణలు వచ్చినప్పటికీ కేజ్రీవాల్‌ను విచారించడానికి... అరెస్ట్ చేయడానికి సీబీఐకి ఇప్పుడే ఆలోచన వచ్చిందన్నారు. దీనిని బట్టి ఈ కేసులో ఆయనను అదుపులోకి తీసుకోవాలని లేదా విచారించాలనే ఆలోచనకు సీబీఐ వద్ద కారణాలు లేవన్నారు. ఈడీ కేసు నుంచి కేజ్రీవాల్ ఎక్కడ బయటపడతారో అనే ఆలోచనతో ముందుజాగ్రత్తగా ఇలా ఇన్సూరెన్స్ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని అభిషేక్ అన్నారు.

  • Loading...

More Telugu News