Asaduddin Owaisi: బీజేపీలో విలీనం వార్తలపై బీఆర్ఎస్ స్పందించాలి: అసదుద్దీన్ ఒవైసీ

MIM Chief Asaduddin Owaisi Said He Did Not Know About BRS

  • ఆ వార్తలు తానూ చదివానన్న ఒవైసీ
  • ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ విధానాలు తనకు తెలియవని స్పష్టీకరణ
  • ఆర్టికల్ 370 ఎత్తివేతతో కశ్మీర్‌ పరిస్థితుల్లో మార్పు లేదన్న హైదరాబాద్ ఎంపీ

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందని, ఇందుకోసం ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ విషయం గురించి తనకు కూడా పూర్తిగా తెలియదని, పత్రికల్లో వార్తలు మాత్రమే చదివానని చెప్పారు. విలీనం వార్తలపై కేసీఆర్ స్పష్టత నివ్వాలని కోరారు. 

పార్టీ కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని, అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు తెలియవని పేర్కొన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతిచెందడం బాధాకరమన్న ఆయన.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

ఆర్టికల్ 370 ఎత్తివేశాక కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడ్డాయని కేంద్రం చెబుతున్నది ఒట్టిదేనని విమర్శించారు. ట్రిపుల్ తలాక్, యూసీసీకి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించినట్టు చెప్పారు. మహారాష్ట్రలో ముస్లిం ప్రార్థనా స్థలాలు, మసీదులపై దాడులు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం కానీ, కేంద్రం కానీ పట్టించుకోవడం లేదని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News