Puja Khedkar: ఫేక్ సర్టిఫికేట్ వివాదం నేపథ్యంలో ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ శిక్షణ రద్దు

The training of probationary IAS officer Puja Khedkar was cancelled by LBSNAA

  • ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం
  • ఆమె సమర్పించిన అంగవైకల్య సర్టిఫికేట్ నకిలీదనే ఆరోపణల నేపథ్యంలో తాత్కాలికంగా శిక్షణ రద్దు
  • అన్ని సర్టిఫికేట్‌లను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం

వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌‌ శిక్షణ రద్దయింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు నకిలీ అంగవైకల్య, ఓబీసీ సర్టిఫికేట్‌లను సమర్పించారనే ఆరోపణల నేపథ్యంలో శిక్షణను రద్దు చేస్తూ ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం పూజా ఖేద్కర్‌కు సమాచారం అందించింది. వివాదం నేపథ్యంలో సర్టిఫికేట్‌ను పరిశీలించాల్సి ఉందని, అందుకే తాత్కాలికంగా శిక్షణను రద్దు చేస్తున్నట్టు లేఖ రాసింది.

జిల్లా శిక్షణా కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించామని, ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించామని లేఖలో పేర్కొంది. తదుపరి చర్య కోసం వెంటనే అకాడమీకి రావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ 23 జులై లోగా అకాడమీకి రావాలని మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. 

కాగా ట్రైనీ ఐఏఎస్ అయిన పూజా ఖేద్కర్‌పై మరిన్ని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆగష్టు 2022లో పూణే జిల్లా పింప్రిలోని ఔంద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తీసుకున్నట్టుగా ఆమె సమర్పించిన పాక్షిక 'లోకోమోటర్ వైకల్యం' సర్టిఫికేట్‌ ఫేక్ అని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యూపీఎస్సీకి ఆమె అందజేసిన సర్టిఫికేట్‌లలో సరిగా కనిపించని వాటిపై విచారణ చేయబోతున్నట్టు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. 

కాగా గతంలో అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ నుంచి తీసుకున్న పీడబ్ల్యూబీడీ కేటగిరి (పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్) సర్టిఫికేట్‌లను 2018, 2021లలో యూపీఎస్సీకి సమర్పించారు. అయితే ఆగష్టు 2022లో పూణేలోని ఔంధ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంగవైకల్య ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ వైద్య పరీక్షల అనంతరం దరఖాస్తును వైద్యులు తిరస్కరించారు. ఆమె అనుచిత ప్రవర్తన నేపథ్యంలో నకిలీ అంగవైకల్య సర్టిఫికేట్ విషయం తాజాగా వెలుగుచూడడం ఆమెను మరింత చిక్కుల్లో పడేసింది.

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2023-బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పూజా ఖేద్కర్ పూణే కలెక్టర్ కార్యాలయంలో తనకు ప్రత్యేక అధికారాలు కావాలంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. తన సొంత కారుకు నీలిరంగు బుగ్గను కూడా బిగించుకున్నారు. మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను పూణే నుంచి బదిలీ చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News