KTR: 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారారు: స్పీకర్ ను కలిసిన అనంతరం కేటీఆర్

10 MLAs joined Congress says KTR

  • పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలన్న కేటీఆర్
  • సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ కు చదివి వినిపించామని వెల్లడి
  • పార్టీ ఫిరాయించేవారిపై వేటు వేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందన్న కేటీఆర్

నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని... ఫిరాయింపులపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అసెంబ్లీ స్పీకర్ కు చదివి వినిపించానని చెప్పారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పత్ర అంటూ మేనిఫెస్టో విడుదల చేసిందని... ఫార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని అందులో స్పష్టంగా పేర్కొందని కేటీఆర్ తెలిపారు. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే ఆ పార్టీ కొట్లాడుతోందని... కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ రూ. 50 కోట్లకు కొంటోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారని చెప్పారు. గోవాలో పార్టీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చే సందర్భంగా వారితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ మారబోమని ప్రమాణం చేయించారని గుర్తు చేశారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను వెంటనే రద్దు చేయాలని స్పీకర్ ను కోరామని చెప్పారు.

  • Loading...

More Telugu News