Chandipura Virus: గుజరాత్‌లో విజృంభిస్తున్న చండీపుర వైరస్.. ఐదు రోజుల్లో ఆరుగురు చిన్నారుల మృతి

Six children die due to suspected Chandipura virus  in Gujarat

  • గుజరాత్‌లో ఇప్పటి వరకు 12 కేసుల నమోదు
  • పూణే వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు శాంపిళ్లు
  • చిన్నారులను కబళిస్తున్న వైరస్
  • 1965లో తొలిసారి మహారాష్ట్రలోని చండీపురలో గుర్తింపు

అనుమానిత చండీపుర వైరస్‌తో గుజరాత్‌లో గత ఐదు రోజుల్లో ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. చండీపుర వైరస్ కేసులు ఇప్పటి వరకు 12 నమోదు కాగా, అందులో నలుగురు ఒక్క సబరకాంత జిల్లాకు చెందినవారేనని మంత్రి పేర్కొన్నారు. మూడు కేసులు అరవల్లిలో నమోదు కాగా, మహీసాగర్, ఖేడాల్లో ఒక్కో కేసు వెలుగు చూసింది. రోగుల్లో ఇద్దరు రాజస్థాన్, ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందినవారని పేర్కొన్నారు.

 నిర్ధారణ కోసం పూణేకు శాంపిళ్లు

చనిపోయిన ఆరుగురి చిన్నారుల్లో ఐదుగురు సబరకాంత జిల్లాలోని హిమంతనగర్ సివిల్ ఆసుపత్రిలో మృతి చెందారు. రోగ నిర్ధారణ కోసం 12 శాంపిళ్లను అధికారులు పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్ఐవీ)కి పంపారు. జులై 10న నలుగురు చిన్నారులు మరణించారని, అందుకు కారణం చండీపుర వైరస్ అయి ఉంటుందని హిమంతనగర్ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. 

ఇది అంటువ్యాధి కాదని మంత్రి పటేల్ తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు. 4,487 ఇళ్లలో 18,646 మందిని గుర్తించినట్టు చెప్పారు. వైరస్ ప్రబలకుండా ఆరోగ్యశాఖ అధికారులు 24 గంటలూ పనిచేస్తున్నట్టు వివరించారు. 

అసలేంటీ చండీపుర వైరస్
చండీపుర వెసిక్యులోవైరస్‌నే చండీపుర వైరస్ (సీహెచ్‌పీవీ)గా పిలుస్తారు. ఈ వైరస్ రాబ్డోవిరిడే కుటుంబానికి చెందినది. మహారాష్ట్రలోని చండీపురలో 1965లో దీనిని తొలిసారి గుర్తించారు. అందుకనే దీనికాపేరు వచ్చింది. దీనిబారిన పడిన చిన్నారుల్లో తీవ్రమైన మెదడువాపు (ఏన్సెఫలైటిస్) వస్తుంది. దోమలు, పేలు, ఇసుక ఈగల ద్వారా వ్యాపిస్తుంది. 

లక్షణాలు
అకస్మాత్తుగా దీని లక్షణాలు కనిపించి త్వరగా పెరుగుతాయి. అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు వంటివి కనిపిస్తాయి. ఈ వైరస్ సోకినవారు కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా పిల్లలు ఎక్కవగా దీనిబారిన పడే అవకాశం ఉంది. కాబట్టి లక్షణాలు కనిపించగానే గుర్తించి చికిత్స అందించడం ద్వారా బయటపడొచ్చు.

  • Loading...

More Telugu News