Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్... ఘోష్ కమిషన్ ఎదుట హాజరైన స్మితా సబర్వాల్, సోమేశ్ కుమార్

IAS officers appear before PC Ghose commission

  • కాళేశ్వరం ప్రాజెక్టులో ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారుల పాత్రపై కమిషన్ ఆరా
  • ప్రాజెక్ట్ స్థలం మొదలు ఆర్థికపరమైన అంశాల వరకు ప్రశ్నించిన ఘోష్ కమిషన్
  • అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలని ఆదేశం

కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, దస్త్రాల విషయంలో విధానపరమైన నిర్ణయాల్లో 'మీ పాత్ర ఏమిటి' అంటూ ప్రస్తుత, మాజీ ఐఏఎస్ అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టు స్థలం, నిర్మాణ సమయం, నిధుల కేటాయింపు, ప్రాజెక్టు అంచనాల్లో మార్పు, లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయించడం తదితర అంశాలపై అధికారుల పాత్రను కమిషన్ ప్రశ్నించింది.

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పని చేసిన స్మితా సబర్వాల్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రజత్ కుమార్, కార్యదర్శిగా పని చేసిన వికాస్ రాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సోమేశ్ కుమార్ హాజరైన వారిలో ఉన్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎస్‌కే జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో లోపాలు, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ విచారణ జరుపుతోంది. బ్యారేజీల నిర్మాణ ప్రాంతాల ఎంపిక, నిర్మాణాలలో వారి పాత్ర తదితర అంశాలపై కమిషన్ వారి నుంచి ఆరా తీసింది. బ్యారేజీల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన తీరు, వారితో ఒప్పందాలు-అమలు, అంచనాల సవరణ, ఉల్లంఘనలు తదితర అంశాలపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలని వారిని కమిషన్ ఆదేశించింది.

నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటికే ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులను, మాజీ అధికారులను ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థికపరమైన అంశాల మీద కూడా ప్రశ్నించిందని తెలుస్తోంది. అంచనా వ్యయ ఆమోదం, పరిపాలనా అనుమతులు, సవరణ అంచనాలు, నిధుల విడుదల, కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతులు, దాని ద్వారా రుణాలు సమీకరించిన తీరు తదితర అంశాలపై ప్రశ్నించిందని సమాచారం.

  • Loading...

More Telugu News