Rajya Sabha: రాజ్యసభలో తగ్గిన బీజేపీ సంఖ్యాబలం.. మెజారిటీకి 12 సీట్ల దూరంలో ఎన్డీయే

Completion of four nominated MPs brings the BJPs strength down to 86 in Rajya Sabha

  • శనివారంతో ముగిసిన నలుగురు నామినేటెడ్ ఎంపీల పదవీకాలం
  • 86కు తగ్గిన బీజేపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య
  • 101కి పడిపోయిన ఎన్డీయే కూటమి సంఖ్యాబలం
  • రాజ్యసభలో ప్రస్తుత మేజిక్ ఫిగర్ 113
  • బిల్లుల ఆమోదానికి ఇతర పార్టీలపై ఆధారపడాల్సి ఉంటుందంటున్న రాజకీయ నిపుణులు

రాష్ట్రపతి నామినేట్ చేసిన నలుగురు రాజ్యసభ ఎంపీలు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం శనివారంతో పూర్తయింది. దీంతో ఎగువ సభలో బీజేపీ సంఖ్యా బలం 86కి తగ్గింది. ఫలితంగా ఎన్డీయే మెజారిటీ కూడా తగ్గిపోయింది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా 20 ఖాళీలు ఉన్నాయి. దీంతో సభలో ప్రస్తుతం మేజిక్ ఫిగర్ 113 కంటే తక్కువగా ఎన్డీయే సంఖ్యాబలం 101గా ఉంది. మెజారిటీకి ఎన్డీయే కూటమికి ఇంకా 12 మంది సభ్యులు అవసరం అవుతారు. 

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వద్ద మొత్తం 87 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్‌ పార్టీకి 26 మంది, తృణమూల్‌ కాంగ్రెస్‌కు 13 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే పార్టీలకు చెరో 10 మంది చొప్పున రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇక ఎన్డీయే, ఇండియా కూటములలో లేని బీఆర్ఎస్ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. పలువురు స్వతంత్ర రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు.

బిల్లుల ఆమోదానికి ఇతర పార్టీలే దిక్కు!
ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే లోక్‌సభతో పాటు రాజ్యసభలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే బిల్లుల ఆమోదం పొందేందుకు ఎన్డీయే కూటమికి రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో ఇతర పార్టీలపై ఎన్డీయే కూటమి ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. గత దఫా ప్రభుత్వం మాదిరిగా మున్ముందు కూడా బిల్లుల విషయంలో అన్నాడీఎంకే, వైఎస్సార్‌సీపీ పార్టీల మద్దతను ఎన్డీయే పొందాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

వైసీపీ, అన్నాడీఎంకే మద్దతు కీలకం?
మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పెద్దగా లోక్‌సభ స్థానాలను గెలవలేకపోయినప్పటికీ ఆ పార్టీ వద్ద 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసినప్పటికీ.. రాజ్యసభలో బిల్లుల ఆమోదం కోసం వైసీపీని ఆశ్రయించాల్సి రావొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇక తమిళనాడు పార్టీ అయిన అన్నాడీఎంకే వద్ద నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇక ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సారధ్యంలోని బీజేడీ వద్ద 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నాయి. అయితే ఈసారి ఆ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలోనే ఆ పార్టీ ఓటమి పాలైంది. కాబట్టి మద్దతు ఇవ్వడం అనుమానమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంచితే రాజ్యసభలో ఖాళీగా ఉన్న 20 స్థానాలకు ఈ ఏడాదే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇందులో 9 సీట్ల వరకు ఎన్డీయే కూటమి పార్టీలు గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News