Trump Rally: తన శరీరాన్ని అడ్డుపెట్టి భార్యాబిడ్డలను కాపాడుకున్న సూపర్ హీరో.. ట్రంప్ ర్యాలీలో చనిపోయిన భర్త

Trump rally victim died a real life superhero while shielding family

  • మాజీ అధ్యక్షుడిపై కాల్పుల ఘటనలో మరణించిన ఫైర్ ఫైటర్
  • బుల్లెట్ శబ్దం వినగానే అలర్ట్ అయి భార్యాబిడ్డలను కాపాడుకున్న వైనం
  • తండ్రి తనను కాపాడిన విధానాన్ని మీడియాకు వెల్లడించిన కూతురు

రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ పై అభిమానంతో ఎన్నికల ర్యాలీకి హాజరైన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ అధ్యక్షుడిపై జరిగిన కాల్పుల్లో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. దుండగుడు ట్రంప్ పైకి కాల్చిన ఆరు రౌండ్లలో ఓ బుల్లెట్ తగిలి కోరే కాంపెరేటర్ (50) అక్కడికక్కడే చనిపోయాడు. ఫైర్ ఫైటర్ గా పనిచేసే కోరే.. భార్యాబిడ్డలను కాపాడుకోవడానికి తన శరీరాన్నే కవచంగా పెట్టాడు. కాల్పుల శబ్దం వినగానే అప్రమత్తమై భార్య, కూతురుకు అడ్డుగా నిలుచుని, వారి తలలు పట్టుకుని నేలపైకి వంచాడు. ఇంతలో గురితప్పిన ఓ బుల్లెట్ నేరుగా కోరే శరీరంలోకి చొచ్చుకెళ్లింది. దీంతో ఆసుపత్రికి తరలించేలోగానే కోరే తుదిశ్వాస వదిలాడు. ట్రంప్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఈ విషాదం గురించి కోరే కూతురు తాజాగా మీడియాకు వెల్లడించింది.

వేదికకు వెనకవైపు నిల్చుని ట్రంప్ ప్రసంగం వింటుండగా కాల్పుల శబ్దం వినిపించడంతో తామంతా భయాందోళనలకు గురయ్యామని అలిసన్ పేర్కొంది. ఇంతలో తండ్రి తనను, తన తల్లిని నేలపై పడుకోవాలని సూచించాడని, తమకు అడ్డుగా నిలుచుని, తలపై చేతులు వేసి కిందికి నెట్టాడని చెప్పింది. దీంతో తాము బుల్లెట్ల నుంచి తప్పించుకున్నాం కానీ తండ్రి మాత్రం తప్పించుకోలేకపోయాడని కన్నీటిపర్యంతమైంది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. 

తన తండ్రి ఓ సూపర్ హీరో అని, ఆయనలాంటి తండ్రి కావాలని ప్రతీ కూతురూ కోరుకుంటుందని తెలిపింది. తమను కాపాడే క్రమంలో ఆయన బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, కోరే కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలంటూ ఆయన సన్నిహితులు ‘గో ఫండ్ మీ’ ద్వారా విజ్ఞప్తి చేయగా.. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆదివారం సాయంత్రానికి ఈ పేజీలో 6.5 లక్షల డాలర్ల విరాళాలు పోగయ్యాయి.

  • Loading...

More Telugu News